Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాముఁడు సీతను వనమునకు రావల దనుట

క.

ఏ సిద్ధి బుద్ధిఁ గఱపిన, దాని నొనర్పంగ నీకుఁ దగుఁ గావునఁ బ
ద్మానన కాననసీమకు, మానుగ రావలదు నిలువుమా నిలయమునన్.

627


ఉ.

కోమలి కాననంబు లతకూనలకుం జొర రాదు దుర్జన
స్తోమనివాసము న్బహుళదుఃఖతరంబు భయస్వరూప ము
ద్దామమృగప్రకాండ మతిదారుణ మచ్చట నెంతయు న్సుఖం
బేమియు లేదు నామతి గ్రహించి సుఖస్థితి నింట నుండుమా.

628


క.

గిరినిర్ఝరజనితము లగు, పరుషనినాదములు భయనబంధురగిరికం
దరవాసిసింహనినదో, త్కరములు వీనులకు దుఃఖకరములు గావే.

629


క.

జనశూన్యము లగుఘోరవి, పినదేశములందు భూరిభీషణఘోషం
బునఁ గ్రీడ సలుపుమృగములఁ, గనుఁగొన్నను భయము వొడముఁగాదె మృగాక్షీ.

630


క.

దారుణనక్రవిహారో, దారము లై బురద గల్గి దంతికలితసం
చారంబు లై తనర్చెడు, భూరిమహానదులు దాఁటఁబోలునె చెపుమా.

631


క.

హరిణాంకవదన భీషణ, తరకృకవాకూపనాదితములు లతాప్ర
స్తరకంటకయుతములు నగు, నరణ్యమార్గముల నడువ నలవియె నీకున్.

632

రాముఁడు సీతకు వనవాసంబునం గల యిడుములఁ దెల్పుట

క.

వనజాతనేత్ర తమయం, తనె రాలినపర్ణతల్పతలములయందుం
బనిపడి నిద్రించుటయును, ఘనసుకునూరులకు మిగులఁ గష్టముగాదే.

633


క.

కమలాక్షి తరువు వలనం, దమయంతనె పడినఫలవితానముఁ దిని కా
లము పుచ్చుచు నాఁకటి కో, ర్చి మనంగాఁ జెల్లు నొక్కొ మృగనేత్రలకున్.

634


మ.

చలిగాలిం బడి నిత్యముం ద్రిషవణస్నానంబుఁ గావించుచున్
ఫలమూలంబుల దేవతాతిథిపితృవ్రాతంబుల న్భక్తి ని
చ్చలుఁ బూజించుచు సంతతవ్రతవిధుల్ సంధించుచున్ దీర్ఘవ
ల్కలముల్ దాల్చి వసింపవచ్చునె వనిం గార్శ్యోపవాసంబులన్.

635


క.

వానప్రస్థోచితవిధి, చే నిత్యము వేదియందు క్షితిజాత గళ
త్సూనార్చలు సలుపఁగ వలెఁ, గాన నరణ్యంబు దుఃఖకరము లతాంగీ.

636


తే.

మానినీమణి లబ్ధంబు లైనమూల, ఫలము లవి కొంచె మైనను బరఁగ వాని
చేతనై మనంబునకుఁ దృప్తి సేయవలయు, గహనవాసంబు కడుదుఃఖకరము సుమ్మి.

637


వ.

మఱియు మహావాతంబులు రజోరూషితంబులై సుడియుచుండు రాత్రులయందు
గాఢతిమిరంబు వ్యాపించియుండు సర్వకాలంబు మిక్కిలి భోజనేచ్ఛ గలిగి
యుండు గిరిసర్పంబులు బహురూపంబులై యతికుటిలసంచారంబులై మార్గంబు