Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బావహిలన్ గ్రసించుచు సమాహికబుద్ధి భవత్పదాబ్జముల్
వావిరిఁ గొల్చుచు న్మధుసువాసితభూముల నిన్నుఁ గూడి యి
చ్ఛావిధిఁ గ్రీడ సల్పెదఁ బ్రసన్నతఁ దోడ్కొని పొమ్ము వచ్చెదన్.

619


క.

దేవా యన్యుల నైనను, బ్రోవ సమర్థుఁడవు నీవు పొలుపుగ నన్నుం
బ్రోవఁగఁ జాలవె మునుకొని, నీవెంట నరణ్యమునకు నిజముగ వత్తున్.

620


వ.

మహాత్మా న్యాయప్రాప్తానుగమనత్వంబువలన నన్నుఁ గ్రమ్మఱింప శక్యంబు గా
దన్నపానవిశేషసంపాదనంబుకొఱకు నీకు దుఃఖంబుఁ గావింపక ఫలమూలంబు
లాహరించి నిత్యంబు నిన్ను సేవించుచుఁ ద్రైలోక్యైశ్వర్యంబు నైన గణిం
పక పాతివ్రత్యంబుఁ జింతించుచుఁ దపశ్చరణశీల నై నియమయుక్త నై నిన్నుం
గూడి యుండెద నదియునుంగాక.

621


సీ.

మనుజేంద్ర గుహలందు మధుగంధివనములయందుఁ బల్వలములయందు శైల
ములయందు శాడ్వలంబులయందు నామదేశములందు బకహంసచక్రవాక
కారండవాకీర్ణకాసారములయందు మించి నీతోడఁ గ్రీడించుకంటె
నాకలోకం బైన నామనంబున కెక్కు డగునె మహాత్మ యిప్పగిదిఁ బెక్కు


తే.

వత్సరంబులు చరియింప వచ్చుఁ గాక, చిత్తమున కొక్కదురవస్థ చిక్కుపడునె
నిన్నుఁ బాసినయెడ నింట నున్న భోగ, మెంత గలిగిన సంతోష మింత లేదు.

622


ఉ.

కావున నే నవశ్యమును గారుణికోత్తమ కాననోర్వికి
న్నీవెనువెంట వచ్చెదను నేర్పులు దెల్పుచుఁ గా దఁటన్నచో
వావిరి దుఃఖశోకమయవారిధిలోన మునింగి చెచ్చెరన్
జీవితముల్ ద్యజింతు నిది సిద్ధము పల్కులు వేయు నేటికిన్.

623


వ.

దేవా మృగయుతంబును వానరవారణసమన్వితంబును సుదుర్గమంబు నగువనం
బునకుం జనుదెంచి యందు భవత్పాదారవిందంబులు సేవించుచుఁ బితృగృ
హంబునందుం బోలె సుఖంబుగా నుండెద నిరంతరానురక్తచిత్త నై యనన్య
భావ నై భవద్వియుక్త నగుదు నేని మరణంబునకు నిశ్చిత నై ప్రార్థించుచున్న
నన్ను శీఘ్రంబున వనంబునకుం దోడ్కొని చను మిది నీకు భారంబు గాదు.

624


చ.

అని యిటు సర్వధర్మకలితాత్మక యైనమహీకుమారి ప
ల్కిన విని రాఘవుండు పలికెన్ మరలన్ నిజపత్నిఁ జూచి కా
ననమునఁ గల్గు బాములు మనంబున నెంచుచుఁ దద్విలోలలో
చనగళదశ్రువుల్ దుడిచి సాంత్వమృదూక్తి ననూనయించుచున్.

625


తే.

అంబుజేక్షణ నీవు మహాకులీన, వగుట ధర్మవిశారద వైతి విచట
నిలిచి మనమున కింపుగా నిఖిలధర్మ, మాచరింపుము ననుఁ గూర్చి యనుదినంబు.

626