Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సౌగుణ్యంబు జాతంబయ్యె నట్టిజనకుని సంక్లేశింపఁజేయుటకుం జాలశీఘ్రం
బున వనంబునకుం జనియెద నని ప్రవాసంబునందు మనంబు గట్టిపఱిచి కైకే
యీనిమిత్తశంకచేత నద్దేవియందు లక్ష్మణునకుఁ గ్రోధనివారణంబు సేయు
తలంపున ని ట్లనియె.

527

రాముఁడు లక్ష్మణునికిఁ గైకమీఁదం గలకోపమును బోఁగొట్టుట

క.

చేవచ్చిన సిరి గ్రమ్మఱఁ, బోవుటయును ఘోరవిపినభూమినివాసం
బావహిలుటయును దలఁపఁగ, దైవకృతము గాక యొరులతరమె కుమారా.

528


తే.

అనఘ కైకభావంబు కృతాంతవిహిత, మైనయది యట్లు గానిచో మాన కిట్లు
తివిరి యనివార్య మగుచు నద్దేవి బుద్ధి, పరఁగ మత్పీడయం దేల పరిణమించు.

529


వ.

మఱియు నద్దేవి భావవైపరీత్యంబు దైవకారణం బని పలికి తదీయసహజభావం
బెఱింగించుతలంపున ని ట్లనియె.

530


తే.

అమలగుణ నాకుఁ దల్లులయం దొకింత, యైన వైషమ్య మెట్లు లే దట్ల సంత
తంబు నాయందు సుతునందుఁ దారతమ్య, మేమియును గైకకును లేమి యెఱుఁగ వొక్కొ.

531


ఆ.

అట్టి నేను గైక యభిషేచనము మాని, భూరిగహనమునకుఁ బొ మ్మటంచు
నశనిపాతకల్ప మైనమాటాడుట, దైవకృత మటంచుఁ దలఁతు జుమ్మి.

532


ఉ.

ఆవిధి గానిచో నరవరాత్మజ యింతకుమున్ను భూరిహ
ర్షావహచిత్తయై ప్రియము లాడుచు నుండినయట్టితల్లి గో
త్రావరుమ్రోలఁ దా నిపుడు ప్రాకృతకాంతబలెన్ మదర్థమం
దీవిరసోక్తు లేల మది నించుక గొంకక పల్కుఁ జెప్పుమా.

533


వ.

మఱియు నద్దైవంబు భూతంబుల కనివార్యంబై యచింత్యప్రభావం బై యుండు
పూర్వస్థితవాత్సల్యాపగమరూపంబునఁ గైకయందును స్వగతరాజ్యభ్రంశ
రూపంబున నాయందును విపర్యయంబు గలిగించెగాదె తత్స్వరూపంబు కార్య
భూతఫలంబులకంటె నొండువిధంబునఁ గానంబడ దట్టి దైవంబుతోడ నొ
డ్డారించుట కెవ్వండును సమర్థుండు గాఁడు లాభాలాభంబులును సుఖదుఃఖం
బులును భయక్రోధంబులును భవాభవంబులు నెయ్యది గలుగఁజేయు నదియె
దైవంబు విశ్వామిత్రాదితపోధనులును జితేంద్రియు లయ్యును దైవప్రపీడితు
లగుచు నియమంబు విడిచి కామక్రోధాసక్తు లగుట యెల్లవారికిఁ దెల్లంబు గదా
యీలోకంబునం దారబ్ధకార్యంబుఁ గ్రమ్మఱించి యసంకల్పితం బగుకార్యం బా
కస్మికంబుగాఁ బ్రవర్ధింపఁజేయు టదియె దైవకార్యం బని యెఱుంగవలయు