Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బునం గాని కామంబునం గాని సత్యప్రతిజ్ఞత్వరూపధర్మం బవలంబించి తత్పరి
పాకంబుఱకు నేకార్యంబు సేయు మని నియోగించె నక్కార్యంబు
ననృశంసవృత్తి యగువాఁ డెవ్వఁ డాచరింపకుండు నట్టియపాపుండ నగు
నేను వరదానహేతుకభరతాభిషేకమద్వివాసనరూపం బైన పితృప్రతిజ్ఞను
యథోక్తక్రమంబున సర్వంబును గావించకుండుటకు సమర్థుండఁ గాను
నాకును భరతునకును మహీరమణుండు నియోగంబునందు సమర్థుం డగు
నంతియే కాదు మజ్జనని యగు కౌసల్యకును భర్తయుఁ బరమగతియుఁ
గావున నిద్దేవియును మనయట్ల పతియాజ్ఞ ననుసరించి వర్తించు టది
పరమధర్మం బైయుండు నాదేవి పుత్రవాత్సల్యంబున నన్ను విడువంజాలక నా
తోడ వనంబునకుం జనుదెంచెద నని తలంచి యున్నది ధర్మప్రవర్తకుండును
బూర్వరాజులకంటె నధికుండును స్వకులాచారధర్మసంస్థితుండు నగు మహీర
మణుండు జీవించి యుండ సహధర్మచారిణియైన యిమ్మహాదేవి పుత్రుండ నైస
నాతోడ నవ్యయువతిచందంబున వనంబున కెవ్విధంబునం జనుదెంచుఁ బతి
హీన యగువనిత పుత్రునితోఁ గూడిఁ జనుదెంచు టది యుచితం బగుం గాని
సభర్తృక యైనయువతి చనుదెంచుట యుచితంబు గా దదియునుం గాక.

513


చ.

అతివల కిందు నం దభిమతార్థకరుండు విభుండు తన్మనో
గతి నతియుక్తిచేఁ గని యకల్మషభక్తి సదా మనంబులో
నతఁడె గురుండు దైవ మఖిలార్థదుఁ డంచుఁ దలంచుచు న్సము
న్నతమతిఁ గొల్చి యుండుట సనాతనధర్మము లాఁడువారికిన్.

514


క.

కావున నీయమ మగనిం, దా విడిచి యధర్మముగ వనంబున కిమ్మై
నావెంట రాఁ బొసంగదు, ధీవిలసితధర్మసరణి తెలియదె నీకున్.

515

శ్రీరాముఁడు కౌసల్య ననూనయించుట

వ.

అని పలికి గ్రమ్మఱ నమ్మహానుభావుం డమ్మ కి ట్లనియె.

516


క.

జననీ పదునాల్గబ్దము, లనఁగాఁ బదునాల్గుదినము లట్ల గడపి చ
య్యన వత్తు మరల వీటికిఁ, బనివడి దీవించి నన్నుఁ బనుపు మడవికిన్.

517


వ.

తల్లీ యేను ధర్మవిరహితరాజ్యకారణంబున మహోదయం బగుయశంబును
దిరస్కరించుటకుం జాల జీవితం బల్పకాలం బగుచుండ నధర్మంబునకుం దలం
కక తుచ్ఛరాజ్యంబుఁ గోరుట తగవు గా దని యిట్లు జనయిత్రి ననూనయించి
పలికి క్రోధశోకాకులుం డగుతమ్మునికి ధర్మరహస్యం బుపదేశించి పదంపడి
నిజజననికిం బ్రదక్షిణంబుఁ జేసి వనప్రయాణోన్ముఖుం డై వెండియు మహా
వ్యధం జెంది గుందుచు మహాసర్పంబుకరణి రోఁజుచు రోషవిష్ఫారితేక్షణుండై