Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున నుండు మేనును దండ్రియట్ల పూజించుటకుం దగినదాన నల్లగుటం జేసి
నాయనుమతి లేక నీవు వనంబునకుం బోవుట ధర్మంబు గా దదియునుంగాక శోక
లాలస నైన నన్ను విడిచి వనంబునకుం జనితేని భవద్వియోగదుఃఖంబునం బ్రా
యోపవేశంబుఁ జేసి ప్రాణంబులు విడిచెద దానం జేసి తొల్లి సముద్రుండు మాతృ
దుఃఖంబున నరూపాధర్మంబువలన బ్రహ్మహత్య నొందినవిధంబున నీవు
లోకవిశ్రుతం బైననిర్ణయంబు నొందఁగలవు నీవు వనంబునకుం జనినపిమ్మట
నాకు సుఖజీవితంబులచేత నయ్యెడుకార్యం బేమి భవత్సహిత్తనై యున్ననాకుఁ
దృణభక్షణంబైనను శ్రేయస్కరంబై యుండు నని పలికి దుఖభరంబున రోద
నంబు సేయుచున్నతల్లిం గాంచి మహానుభావుం డైనరాముండు ధర్మసహితం
బగువాక్యంబున ని ట్లనియె.

496

రాముఁడు కౌసల్యకు సయుక్తికంబుగా సమాధానంబుఁ జెప్పుట

క.

జనకుని వాక్యము నది గా, దని మీఱఁగ నా కశక్య మటు గాన మహా
వినయమున మ్రొక్కి వేఁడెదఁ, బని విని వనమునకు నన్నుఁ బనుపుము తల్లీ.

497


ఆ.

పరమపండితుండు వ్రతచారియును ధర్మ, కోవిదుఁడు మహానుభావుఁ డైన
కండు వనెడు మునిశిఖామణి జనకువ, చనముఁ బట్టి గవిని జంపలేదె.

498


తే.

మును మదన్వయకర్తయై తనరు సగరుఁ, డనుమహాత్మునియానతి నతనిసుతులు
ఘనమఖాశ్వంబుకొఱకు నఖప్రహతుల, బుడమిఁ ద్రవ్వి పదంపడి మడియ లేదె.

499


తే.

విను మదియుఁ గాక జమదగ్నితనయుఁ డైన, రాముఁ డతనియానతిని శిరంబునందు
దాల్చి దయమాలి మనమునఁ దల్లి యనక, పట్టి రేణుకఁ ద్రుంపఁడే పరశుహతిని.

500


వ.

 మఱియుఁ బ్రాణంబులనైనఁ బరిత్యజించి పితృవాక్యంబు పరిపాలనీయం బని
పండితులైన కండుముఖమహర్షులు పలికిరి పితృవాక్యగౌరవంబున గోవధ మాతృ
వధాదికంబు మహాత్మ లగుపూర్వులచేత నాచరితం బయ్యెం బితృవాక్యం
బె ట్లలంఘనీయం బట్లు మాతృవాక్యంబు నలంఘనీయంబై యుండు నైన
నేకకాలంబున నుభయవాక్యకరణంబునం బ్రవర్తిల్లుట దుర్లభం బట్లగుటం
జేసి పితృవాక్యంబు ప్రథమకర్తవ్యం బని పలికి రదియునుం గాక పితృవాక్యో
ల్లంఘనంబునఁ బితృవధపాతకంబు వాటిల్లు నే నొక్కరుండనేకాను నాచేతఁ
బరికీర్తితులైన వీ రందఱుఁ బితృశాసనంబుఁ గావించి కృతార్థులైరి గావున
నాకునుం బూర్వాచారవిరుద్ధం బైనధర్మంబునం బ్రవర్తిల్లుట పాడి గాదు తొల్లి
మహాత్ము లగువారిచేత నంగీకృతం బైనమార్గం బవలంబించి యెల్లభంగులఁ