తే. |
అవని దిగనాడి వనమున కరుగ నున్న, యతనిమానసవైక్లబ్య మచటివారి
కేమిఁ గనుపట్ట దయ్యె నదెంత చిత్ర, మఖిలలోకాతిగునిచిత్త మట్ల సనుము.
| 447
|
క. |
విగతాతపత్రచామరుఁ, డగుచు రథము డిగ్గి యనుచరాలి విడిచి యొ
ప్పుగ నింద్రియములు వెంటం, దగులక మది దుఃఖ మడఁచెఁ దద్దయుఁ దాల్మిన్.
| 448
|
క. |
అంతటఁ బురజనములు శ్రీ, మంతుం డగునతనివదనమండలమున నొ
క్కిం తైనవిషాదముఁ గన, రెంత మహాత్ముఁడు జనకజేశ్వరుఁ డహహా.
| 449
|
తే. |
శరదుదీర్ణాంశుఁ డగుపూర్ణచంద్రుఁ డాత్మ, తేజమును బోలె నమ్మహాధీరవరుఁడు
వితత మగునిజహర్షంబు విడువఁ డయ్యె, విమలవిజ్ఞానధైర్యవివేకయుక్తి.
| 450
|
వ. |
అప్పుడు విపులవిక్రముం డగులక్ష్మణుండు రామునియట్ల దుఖంబు మనంబున
నిడికొని యమ్మహాత్ముని వెంటం జనుచుండె నివ్విధంబున నారఘుపుంగవుండు
సమానశోకుం డగుసౌమిత్రితోడ నరుగుదేరఁ బ్రాణనాశశంకచేత సుహృజ్జనం
బుల కభిషేకవిఘాతకథావృత్తాంతంబుఁ జెప్పక యెప్పటియట్ల మధురవాక్యం
బున మన్నించుచు సాక్షాత్కృతనిత్యనిరతిశయానందాత్ముండై కౌసల్యానివాస
యోగ్యం బైనదివ్యమందిరంబునకుం జనియె నంత నిక్కడఁ బురుషశార్దూలుం
డగురాముఁడు మాతృగృహంబునకుం జనినపిమ్మట దురంతచింతాభరపరి
శ్రాంత లై యంతఃపురకాంత లెల్ల నొక్కట నార్తధ్వనులు సేయుచుఁ
దమలో నిట్లని విలపించిరి.
| 451
|
అంతఃపురస్త్రీలందఱు విలపించుట
ఉ. |
నెయ్య మెలర్ప నెవ్వఁ డిట నిత్యము భూపతిచే నచోదితుం
డయ్యును రాష్ట్రకృత్యములయందు జితశ్రముఁ డై చరించు సా
హాయ్యము సేసి యెవ్వఁడు జనాలికి సద్గతి యై చెలంగువాఁ
డయ్యవనీసుతాపతి మహాగహనంబున కేగు నక్కటా.
| 452
|
తే. |
దాశరథి జన్మ మాదిగఁ దల్లియందు, ననిశ మేరీతి వర్తించు మనలయందు
నత్తెఱంగున వర్తించు నమ్మహాత్ముఁ, డకట నేఁడు నిర్వాసితుం డయ్యె నేల.
| 453
|
వ. |
మఱియు నెవ్వాఁడు శ్రుతపారుష్యం డైనను గ్రోధింపక క్రోధహేతుకర్మం
బులు పరిత్యజించి కుపితు లగువారలఁ బ్రసాదంబు నొందించునట్టి పరమదయా
ళుం డగురాముని వనంబునకుం బుచ్చిన యచ్చపలాత్ముఁ డగుదశరథుండు
జీవలోకంబు నెల్ల హింసించుట కోర్చువాఁ డని దశరథుని నిందించుచు ననేకు
లనేకప్రకారంబుల లేఁగలఁ బాసిన మొదవులచందంబున విలపించుచున్న
వారల రోదనంబు విని పుత్రవియోగసంజాతశోకాభిసంతప్తుం డైన యద్దశర
థుండు పర్యంకంబుమీఁదం బడి లజ్జితుండై దుఃఖించుచుండె నంత నిక్కడ.
| 454
|
సీ. |
స్వజనదుఃఖప్రాప్తి సంజాతభేదుఁ డై రఘుపతి మత్తవారణముకరణి
నూర్పులు పుచ్చుచు నేర్పునఁ దద్దుఃఖ మవనయించుచు మాతృవిపులగృహము
|
|