|
భోజనాదులు సలుపం డని వేగిరపడి పలికిన నక్కైకేయిదారుణవాక్యంబు
విని యక్కకుత్స్థకులతిలకుండు ధైర్యధుర్యుండు గావున నొక్కింత యైన మ
నంబున శోకింపక కైకేయివచనంబునకు రోయుచు శోకపరిప్లుతుం డై యూ
ర్పులు వుచ్చుచు హేమభూషితం బైనపర్యంకంబుమీఁదం బడి పొరలుచున్న
తండ్రిం గ్రుచ్చి యెత్తి సాంత్వవచనంబులం చేర్చుచుఁ గశచేతఁ దాడితం
బైనవాజిచందంబున వనగమనంబునందుఁ గృతత్వరుండై వెండియుఁ గైక కి
ట్లనియె.
| 438
|
సీ. |
జనని నే ధనపరుండను గాను లోకంబు నొగి సంగ్రహించుట కుత్సహింప
నను మునిసమునిఁ గా నయసత్యధర్మతత్పరునిఁ గా నెఱుఁగుము పరఁగ నెద్ది
నాచేతఁ బతికిఁ బ్రాణత్యాగమున నైన సత్త్రియం బొనరింప శక్య మదియుఁ
గృత మయ్యె నని నీవు మతి నెఱుంగుము జనవిభునకు హితముఁ గావించుకంటెఁ
|
|
తే. |
దలఁప నాకుర్వి వేఱొక్కధర్మ మెద్ది, లేదు గావున నృపుఁడు దా నూఁది చెప్ప
కున్న నీయాజ్ఞ శిరమున నునిచి గహన, వాటి నుండెదఁ బదునాల్గువత్సరములు.
| 439
|
వ. |
తల్లీ నీవు నా కత్యంతనియంత్రి వయ్యు భరతున కభిషేకంబుఁ గావించి నీవు
వనంబునకుం జను మని భవద్వచనకారి నైనసన్ను నియోగింపక మహావిభుని
నిర్బంధించితివి గావున నాయందు సన్నివిష్టం బైనయార్జవౌదార్యాదిగుణం
బించుకయైన నెఱుంగనిదాన వని యూహించెద.
| 440
|
రాముఁడు దశరథునకు నమస్కరించి బయలుదేరుట
ఆ. |
జననివగపుఁ దీర్చి జనకకుమారి న, నూనయించి పిదపఁ గాననమున
కిపుడె పోవువాఁడఁ గృపఁ జేసి యందాఁక, దడవొసంగ వలయు ధర్మయుక్తి.
| 441
|
క. |
భరతుఁడు రాజ్యం బేలుచు, గురునకు శుశ్రూష సేయుగుణ మగు టె ట్లా
తెఱఁగున నీచే సుగుణో, త్క రమునఁ గర్తవ్య మది ప్రథమధర్మ మగున్.
| 442
|
క. |
అని పలుకుసుతునిమాటలు, విని భూపతి భూరిశోకవివశాత్మకుఁ డై
కనుఁగొనల నశ్రు లొలుకఁగఁ, గనుఁగవ ముకుళించి ఘోరగతి దుఃఖించెన్.
| 443
|
ఉ. |
అంత మహీశుపాదముల కారఘునేత నమస్కరించి త
త్కాంతపదద్వయంబునకు దండముఁ బెట్టి తదీయమందిరా
భ్యంతరసీమఁ దా వెడలె నశ్రులు నించుచు లక్ష్మణుండు దా
నెంతయుఁ గ్రుద్ధుఁ డై వదన మెత్తక వెంబడి నేగుదేరఁగన్.
| 444
|
తే. |
జానకీజాని యాభిషేచనికభాండ, మపుడు వలగొని చనియెఁ దా నందు మిగుల
దృష్టి సొరనీక కరము సాపేక్షఁ డగుచు, మందగతి నిష్టజనములు సందడింప.
| 445
|
ఆ. |
రజనికాంత జగతి రాకాసుధాంశుని, కాంతి మాపలేనికరణి రాజ్య
నాశ మతనిమోమునం గలఘనకాంతి, నపహరింపఁ జాల దయ్యె నహహ.
| 446
|