|
సేరంగఁ బోయి హజారంబునం దున్నవారిఁ గన్గొనుచు నవ్వలిద్వితీయ
కక్ష్య డగ్గఱి యందుఁ గడువృద్ధు లగువిప్రవరులకు మ్రొక్కుచుఁ బరఁగ నవల
|
|
తే. |
నలరుమూఁడవకక్ష్య డాయంగఁ బోవ, నందుఁ గావలి యున్నస్త్రీబృంద మపుడు
త్వరితముగ లోపలికిఁ బోయి తత్ప్రియంబుఁ, బ్రీతి నెఱిఁగించె నారామమాతతోడ.
| 455
|
రాముఁడు కౌసల్యకడకుఁ బోవుట
వ. |
ఇట్లు రాముఁడు దనరాక యెఱింగించి పుచ్చి తోడన తానును నద్దేవి యున్న
కడకుం జని యందు దేవపూజార్థంబు సంగ్రహింపఁబడియున్నదధ్యక్షత
ఘృతహవిర్లాజంబులును మోదుకంబులును శుక్లమాల్యంబులును బాయసం
బును గృసరంబులును సమిత్తులును బూర్ణకలశంబులును గనుంగొనుచు సమా
హితచిత్త యైయారాత్రి యుపవాసంబు సలిపి సూర్యోదయసమయంబునం
గృతమంగళస్నాన యై శుక్లక్షౌమచేలంబుఁ దాల్చి తనయభ్యుదయంబుకొఱకు
విప్రులచేత మంత్రపవిత్రాగ్నిహోత్రంబునందు హోమంబు సేయించుచు దేవ
తాసంతర్పణంబుఁ గావించుచున్ననిజజననిం గాంచి బాలాశ్వంబు నెదుర్కొ
నినహయాంగనభంగి త న్నెదుర్కొనినయద్దేవిచరణంబుల కభివందనంబులు
గావించె నప్పు డద్దేవి సమాగతుం డైనకుమారు నవలోకించి కనుంగొనల
నానందబాష్పధారలు జడిగురియ హర్షోత్కర్షంబున నిజకరంబుల గ్రుచ్చి యెత్తి
చుబుకంబు పుణికి శిరంబు మూర్కొని వదనంబు ముద్దు గొని వాత్సల్యంబు
దీపింప మధురవాక్యంబున ని ట్లనియె.
| 456
|
తే. |
అనఘశీలురు ధర్మాత్ము లమితతేజు, లధికవిశ్రుతు లైనపూర్వాధిపతుల
యశము నాయువు ధర్మంబు నఖిలహితముఁ, బొందు నీ వింక సతతంబుఁ బుత్రవర్య.
| 457
|
ఆ. |
సత్యవాది యైనజనపతిఁ గనఁ జను, మమ్మహాత్ముఁ డిపుడె యఖిలధరణి
కధిపుఁ గాఁగ నీకు నభిషేక మొనరించు, నిఖలనృపులు మెచ్చ నేఁడు వత్స.
| 458
|
రాముఁడు తనకు సంభవించిన యరణ్యగమనంబుఁ గౌసల్య కెఱింగించుట
వ. |
అని పలికి యొక్కకనకాసనం బిచ్చిన నారాముండు భోజనార్థంబు తల్లిచేత
నిమంత్రితుం డగుచు నయ్యాసనంబు వ్రేల ముట్టి స్వభావవినీతుం డైనను
మాతృత్వప్రయుక్తగౌరవంబువలన మిక్కిలివినీతుం డై వ్రీడానమ్రవదనుఁ
డగుచు దండకారణ్యగమనంబున కనుజ్ఞాకాంక్షి యై కేలుదమ్మి ఫాలంబునం
గీలించి కౌసల్య కి ట్లనియె.
| 459
|
క. |
జననీ యేమని చెప్పుదు, ననివార్యం బైనయొకభయంబు గలిగె నీ
కును సీతకు సౌమిత్రికి, ఘనతరదుఃఖార్థిహేతుకం బది తలఁపన్.
| 460
|