Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చేతఁ గ్రమ్మఱ నేల పరితపింపఁ జేసెద వనిన నతం డమ్మహీవిభునిదీనస్వరంబును
వదనంబునందలి వైవర్ణ్యంబును బరికించి యిది యేమియొకో యని వెఱఁ గం
దుచు నేమియుం బలుకనేరక యూరకుండె నప్పుడు స్వనాథ్యోచితవిచారతజ్ఞ
యగుకైక సూతపుత్రు నవలోకించి యి ట్లనియె.

382

కైక రామునిఁ దోడితెమ్మని సుమంత్రు నియోగించుట

ఉ.

ఓయి సుమంత్ర రామవిభవోత్సుకుఁ డై జననాథుఁ డీనిశ
న్బాయక నిండుజాగర మొనర్చుటచేఁ గడు డస్సి యిందు ని
ద్రాయుతుఁ డయ్యె నీ వరిగి రాజకుమారవరేణ్యు జానకీ
నాయకు రామభద్రుని జనప్రియుఁ దోడ్కొని రమ్ము చెచ్పెరన్.

383


వ.

అని వేగిరపడి పలికిన నద్దేవిపలుకులం దోఁచువిశ్వాసంబువలన నిక్కంబుగా
మహీపతిశాసనంబున నద్దేవి యభిషేకార్థంబు రామునిం దోడ్కొని ర మ్మ
నియె నని తలంచుచుఁ బ్రీతచేతస్కుం డై నాగరహ్రదసంకాశం బయినయంతః
పురంబు నిర్గమించి జనసంబాధం బగుమొగసాలకడకుం జనుదెంచి యచ్చట
నున్న మహీపతులను బౌరుల నుపహారపాణుల నుపస్థితుల విలోకించుచుం
బోవుచుండె నప్పుడు సభాసదనంబునందు నిండి యున్న వేదపారగు లగువిప్రు
లును బలముఖ్యులును మంత్రులును మహీపతులును రాజపురోహితులును
దక్కినసమస్తజనంబు లొక్కట గుంపులు కట్టి తమలోన సూర్యుఁ డుదయించెఁ
గర్కాటకలగ్నంబు డగ్గఱియె సమగ్రవ్యాఘ్రచర్మసమాస్తీర్ణం బగురథంబును
గాంచనమయం బగుభద్రపీఠమును సాగరగంగాయమునాసరస్వతీప్రముఖ
ముఖ్యాపగాసరోవరప్రదకూపజలపూరితంబు లై క్షీరివృక్షపల్లవోపేతంబు లై
పద్మోత్పలకైరవశోభితంబు లైనసరస్సులచందంబునం దనరు ధౌతకలధౌత
ఘటంబులును దధిమధుఘృతలాజదర్భపుష్పక్షీరప్రముఖమంగళద్రవ్యంబులును
సర్వాభరణభూషిత లగువారకాంతలును జంద్రాంశువికచప్రఖ్యంబును రత్న
దండమండితంబును గంధపుష్పాలంకృతంబు నైనవాలవ్యజనంబును సుధాకర
మండలసంకాశపాండరచ్ఛత్రంబును బాండురవృషభంబును బాండురాశ్వం
బును స్రవన్మదద్విపంబును రాజవాహ్యంబులును స్వలంకృతం బగుకన్యాష్టకం
బును సర్వవాదిత్రంబులును సూతమాగధవందిగాయకులును దక్కినసమస్త
మంగళద్రవ్యంబులును సన్నిహితంబు లయ్యె నింకఁ దడ వేల యని వేగిరపడు
చుండిరి మఱియు యోగ్యానర్ఘరత్నవస్తుజాతం బుపాయనంబుగాఁ గొని
రాజశాసనంబున రామాభిషేకంబునకుం జనుదెంచిన మహీపతు లందఱుఁ
గూడుకొని మహీపతిం జూడ మైతిమి సూర్యుం డుదయించె రామాభిషేకసం
భారం బంతయు సజ్జం బయ్యె మనరాక మహీపతి కెఱిఁగించువాఁ డెవ్వండొకో
యని విచారించుచుండ సార్వభౌము లైనయమ్మహీపతుల నందఱ విలోకించి