Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాజసత్కృతుం డగుచు సుమంత్రుఁ డేను రాజశాసనంబున రామునిం దోడి
తెచ్చుటకుం బోవుచున్నవాఁడ మీరు దశరథునకు రామునకు విశేషించి పూ
జ్యులు గావున దీర్ఘాయుష్మంతు లైనమీవచనంబువలన దశరథుని కుశలం
బడిగి దర్శనంబునకు రాకుండుటకు నైనకారణంబు నడిగెద నని చెప్పి సామంత
రాజానువర్తనరూపపురాణవృత్తాంతాభిజ్ఞుం డైనసుమంత్రుండు మరలి యంతః
పురద్వారంబు దాఁటి సదాసక్తం బైనయమ్మహనీయమందిరంబుఁ బ్రవేశించి
యమ్మహీపాలునివంశంబుఁ గొనియాడుచు శయనగృహంబులోనికిం జని యవ
నికమాటున నుండి గుణయుక్తంబు లైనయాశీర్వచనంబులచే స్తోత్రంబుఁ గావిం
చుతలంపున ని ట్లనియె.

384

సుమంత్రుఁడు మహీపతులనియోగంబున మరల దశరథునియొద్ది కరుగుట

క.

రవిసోములు వాసవవై, శ్రవణులు వహ్నియును మఱియు జలధివిభుండున్
శివుఁడును గారుణ్యంబున, నవనీశ్వర విజయ మిత్తు రనిశము నీకున్.

385


ఆ.

అధిప రాత్రి చనియె నర్యముఁ డుదయించె, సర్వకృత్యములును జతను పడియె
రాజవర్య యింక రమణతో మేల్కన, వలయుఁ గార్య మెల్ల సలుపవలయు.

386


క.

బలముఖ్యులు భూసురులును, జెలువుగ నైగములు వచ్చి చిత్తంబున మి
మ్మలఘుమతిఁ జూచుకోరికఁ, దలవాకిట నున్నవారు ధరణీనాథా.

387


క.

అని పలుకు నలసుమంత్రుని, ఘనబుద్ధిని మంత్రవిదునిఁ గని యతని సుమం
త్రునిఁగా నెఱింగి వెస న, య్యినకులహరిణాంకుఁ డతని కి ట్లని పలికెన్.

388

దశరథుఁడు రామునిఁ దోడి తెమ్మని సుమంత్రున కాజ్ఞాపించుట

సీ.

సూతశేఖర నీవు సీతాధిపతిని శీఘ్రమునఁ దో డ్తెమ్మని కైకచేతఁ
బరఁగ నియోగింపఁబడితి వ ట్లనుమత మనిషిద్ధ మనెడున్యాయంబుచేత
మొనసి మచ్ఛాసనంబున వచించినకైకవచన మమోఘ మవ్వాక్య మేల
దీర్పక మరల నేతెంచితి వది నాదుమతమొ కాదో యని మానసమున


ఆ.

సంశయించి యిట్లు చనుదెంచితివొ జాగు, సేయవలదు మరలఁ జెప్ప నేల
రయము మీఱ నేగి రాముని రవివంశ, తోయరాశిసోముఁ దోడి తెమ్ము.

389


చ.

అనిన మహాప్రసాద మని యాతఁడు నేలినవానియాజ్ఞఁ జ
య్యనఁ దలఁ బూని భక్తివినయప్రమదంబులు మానసంబున
న్బెనఁగొన సంతతోత్సవనవీకృతరాజపథంబునం బురీ
జనములు దన్నుఁ జూచి కడుసంతస మందఁగ నేగె నున్నతిన్.

390


తే.

రాజవీథుల నందంద రమణతోడఁ, జెలఁగి శ్రీరామచంద్రాభిషేకకథలఁ
జెప్పుకొనువారిమాటలు చిత్త మలర, నాలకించుచు రయమున నరిగె నతఁడు.

391


వ.

ఇత్తెఱంగునం జని.

392