Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గమనంబున నంతఃపురంబుఁ బ్రవేశించి దశరథునకుం బాటిల్లిన దురవస్థ యె
ఱుంగనివాఁ డగుటంజేసి యెప్పటియట్ల మహీపాలునికడకుం జని సంప్రీతచే
తస్కుం డగుచు నిటలతటఘటితాంజలిపుటుండై ప్రాతఃకాలార్హంబులును
బరితోషకారణంబులు నైనవాక్యంబుల ని ట్లనియె.

376

సుమంతుఁడు దశరథుని మేలుకొలుపుట

తే.

అధిప సంపూర్ణచంద్రోదయంబునందు, సంక్రమితతన్మనోజ్ఞతేజమున జలధి
చెలఁగి సుప్రీతుఁ డగుచు రంజిల్లఁ జేయు, కరణి రంజిల్లఁ జేయుము కరుణ మమ్ము.

377


ఉ.

మాతలిజంభసూదనునిమాడ్కి శ్రుతు ల్పరమేష్ఠినట్ల య
బ్జాతసఖుండు చంద్రుఁడును బాయక నెప్పుడు మేదినింబలె
న్భూతలనాథ యే నినుఁ బ్రబోధితుఁ జేసెన మేలుకొమ్ము సం
జాతకుతూహలంబునఁ బ్రసన్నముఖుండవు గమ్ము నాయెడన్.

378


ఉ.

రాజవరేణ్య మోద మలరం గృతకౌతుకమంగళుండవై
యోజ దలిర్ప రత్నరుచిరోత్తమభూషణభూషితుండవై
తేజ మెలర్ప భాస్కరుఁడు దేవనగంబున నుండి సర్వది
గ్రాజి వెలుంగ వెల్వడినకైవడి లెమ్ము ప్రసన్నమూర్తివై.

379


క.

జననాథ పవనసోములు, దిననాథుఁ డుషర్బుధుండు దేవాధిపుఁడు
న్వననిధివిభుండు శంకరుఁ డనిశము జయ మిత్తు రతిదయామతి నీకున్.

380


సీ.

మనుజనాయక రాత్రి చనియె సహస్రాంశుఁ డుదయించె మేల్కాంచి యుచితవిధులు
సలిపి రామాభిపేచనకార్య మొనరింప గడఁగు మరుంధతీకాంతుఁ డఖిల
సంభారములఁ గూర్చి సకలభూపురయుతుం డై నగరద్వారమందు నిలిచి
యున్న వాఁ డెల్లవా రుత్సవశ్రీదర్శనోత్సాహులై కూడి యున్నవారు


ఆ.

చందురుండు లేని శర్వరికరణిఁ గా, పరియు లేని పసులపగిది గిబ్బ
లేని మొదవుభంగి నై నీవు లేని వీ, డొనర వేడ్క సేయకున్న దిపుడు.

381


వ.

అని పలికిన నతనిస్తుతివచనంబు లాకర్ణించి క్రమ్మఱ నమ్మహీపతి శోకమూర్ఛా
పరవశుం డగుచు నెఱ్ఱనివిరితామరలం దెగడుకన్నులు విచ్చి సుమంత్రు నవలోకించి
నష్టహర్షుఁ డై కైకేయీక్రూరవచననికృత్తమర్ముండ నైననన్ను స్తుతివాక్యంబుల