Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యువును సత్యవశగతత్వంబున భవదధీనుండును విశేషించి వల్లభుండ నైననాకుఁ
బ్రసాదం బొసంగుము నీచేత వరబలంబునఁ బ్రతిగ్రహింపఁబడిన రాజ్యంబును
మత్ప్రీత్యర్థంబుగా రామున కొసంగుము రామాభిషేకంబు నాచేత నిర్జనప్రదే
శంబునందు సముదాహృతం బైనది గాదు రాజసభామధ్యంబునం బలుకఁబడిన
యది గావున దాని కసత్యత్వంబు గలుగకుండ సార్థకత్వంబు నొందించి సత్యవశ
గతత్వంబువలన భవదధీనుండ నైననన్నుఁ బ్రోచి కీర్తిలాభంబు పడయు మిక్కా
ర్యంబు నాకును రామునకు లోకంబునకు గురువులకు భరతునకుఁ బ్రియంబై
యుండునని ధర్మబోధంబుగాఁ బలుకుచు శోకరోదనతామ్రాక్షుండై కన్నీరు
నించుచు నిలపించుచున్న యద్ధశరథుం గనుంగొని తదీయవిచిత్రకరుణవిలాపంబు
విని యద్దేవి కోపరసాధిదేవతయుం బోలె నేత్రకోణంబులఁ దామ్రదీధితులు
నిగుడ మొగంబెత్తి యతనిం దనచూపుచిచ్చునం గాల్చుచు నదత్తప్రతివచనయై
యూరకుండె నప్పు డమ్మహీనాథుండు నిత్యంబును మనోనుసారిణియై యుండి
తత్కాలంబున బుద్ధివైపరీత్యంబునఁ బ్రతికూలభాషణంబులు పలుకుచున్నకైకే
యిమొగం బట్టె చూచి రామవివాసనరూపం బగువరంబుఁ దలంచి చిరపరి
చితప్రేమంబున నద్దేవిని ధిక్కరించుటకుం జాలక ప్రియపుత్రుని వనంబునకుం
బనుచుట కోర్వక మూర్ఛాక్రాంతుండై ధరణిపయిం బడియె నిట్లు విసం
జ్ఞుండై పడియున్న యద్దశరథునకుఁ దెలివి దొరకొనుట కవ్విభావరి యనుగ్ర
హించె ననం దూ ర్పెఱ్ఱనగుచు వచ్చెఁ బదంపడి బోధనసాధనమంగళగీతాది
కంబు సెలంగె నప్పుడు దాని నివారించి పుత్రవియోగజనితశోకంబు సహింపం
దరంబుగామికి నేలంబడి వివేష్టమానుండై విలపించుచున్నరాజు నవలోకించి
మరల న త్తెఱవ యి ట్లనియె.

363


తే.

జనవరోత్తమ మును నాకు సంశ్రవంబు, స్వీకరించియు దురితంబుఁ జేసినట్లు
ధరణిపయిఁ బడి మిక్కిలి పరితపించె, దేల స్థితియందు నిల్వ నీ కిది గుణంబె.

364


తే.

ధర్మవిదు లగువారు సత్యంబు పరమ, ధర్మ మని పల్కి రేనును ధర్మయుక్తిఁ
దడయ కడిగితి నీవును ధర్మ మూఁది, వరము లొసఁగక యిబ్భంగి వగచె దేల.

365


చ.

మును తనమేనుఁ గోసి నృపముఖ్యుఁడు శైబ్యుఁడు పక్షి కిచ్చుట
ల్ప్రణుతవదాన్యశేఖరుఁ డలర్కుఁడు పాఱున కక్షు లిచ్చుట
ల్వనినిధి వేల దాఁటి సుకరంబుగ మేదిని ముంప కుండుట
ల్దినకరుఁ డెండ గాయుటయు ధీవర సత్యము నూఁదియేకదా.

366


క.

సత్యమునఁ గలుగుఁ బరమును, సత్యంబున నుండు ధర్మసంచయ మెల్లన్
సత్యంబె శ్రుతులు బ్రహ్మము, సత్యేతర మైనదొకటి జగతిం గలదే.

367


వ.

రాజేంద్రా యేను ధర్మపరిపాలనార్థంబు నిన్నుం బ్రేరేపించితి నీకు ధర్మసం
రక్షణంబునందు నియతి గల దేని మత్ప్రేరణంబునఁ బుత్రుం డగురాముని వనం