Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బునకుం బంపు మిమ్మాట ముమ్మాటికిం బలికితి నట్లు సేయవేని నీయెదుట నిప్పు
డే జీవితంబు విడిచెద నని యిట్లు కైకేయిచేతఁ బ్రచోదితుండై యద్దశరథుం
డుపేంద్రకృతం బైనపదత్రయప్రతిశ్రవరూపం బగుపాశంబునం గట్టుపడిన బలి
చందంబున నార్మవినాశకరం బైనసత్యపాశంబునం గట్టువడి విడివడ సమ
ర్థుండు గాక యుగచక్రాంతరంబునం జిక్కిన ధురంబు పగిది నుద్భ్రాంతచిత్తుం
డును వివర్ణవదనుండు నై నేత్రంబుల నశ్రుకణంబులు దొరఁగఁ గొండొకసే
పూరకుండి వెండియు నొక్కింత ధైర్యం బవలంబించి యక్కైకయాననంబు
విలోకే౦ప రోసి యవాఙ్ముఖుం డై యి ట్లనియె.

368


తే.

నిగమసంస్కృతమైన యే నీకరంబు, శిఖిసమక్షమునందు నాచే గ్రహింపఁ
బడియె నప్పాణి నిప్పుడు విడుతు నాకుఁ, బ్రియసుతుం డైనభరతుఁ బరిత్యజింతు.

369


వ.

మఱియు సూర్యోదయసమయం బయ్యె నింక గురుజనంబు లభిషేకార్థంబు
కల్పితంబులైన సంభారంబులచేత రామాభిషేకంబు నుద్దేశించి నన్ను వేగిర
పడి పలుకుదురు గావున రాముండు కృతాభిషేకుం డై యుండఁగలం డట్లుగాక
నీచేత విఘ్నంబు సంభవించెనేని యతనియాననం బాలోకింప నోడి
యేను బరిత్యక్తకళేబరుండనై లోకాంతరంబునకుం జనియెద నప్పుడు మృతుండ
నైన నాకు సలిలక్రియ సల్పుటకు రామభద్రుండె యర్హుం డగుం గాని
సమాతృకుం డైనభరతుం దర్హుండు గాఁ డేను దొల్లి రామాభిషేకప్రారంభ
వేళయందుఁ దాదృశసుఖయుక్తం బైనజనంబు నవలోకించి యిప్పుడు హత
హర్షం బగుటవలన నిరానందం బైయున్నజనంబును గ్రమ్మఱ నవలోకింపం
జాల నని పలికినఁ బాపచారిణి యగుకైక క్రోధమూర్ఛిత యై వెండియు
ని ట్లనియె.

370


చ.

జనవర క్రూరశస్త్రసదృశం బగువాక్యముఁ బల్కె దేల నీ
తనయుని రాము రాఁ బనిచి దారుణకాననసీమకు న్వెస
న్బనిచి మదీయపుత్రునకుఁ బట్టము గట్టి మహాత్మ నన్నుఁ జ
య్యన నసపత్నఁ జేసి చరితార్థుఁడవై సుకృతంబుఁ గాంచుమా.

371


వ.

అని పలికిన నమ్మహీరమణుండు తీక్ష్ణంబైన ప్రతోదంబుచేతఁ దాడితంబైన
హయంబుభంగి సారెసారెకుఁ గైకేయీవాక్యచోదితుండై యద్దేవి నవలోకించి
యేను ధర్మపాశంబున బద్ధుండ నైతి మద్బుద్ధి ప్రణష్ట యయ్యె యశస్వియు
జ్యేష్ఠపుత్రుండును బ్రియుండును ధార్మికుండు నగురామునిం జూడఁ గోరెద
నతని రావింపుము.

372


క.

అని యిట్లు పలుదెఱంగుల, జననాథుఁడు పరితపించుసమయంబునఁ బూ
ర్వనగశిఖరోపరిస్థిత, ఘనరత్నమువోలెఁ దీవ్రకరుఁ డుదయించెన్.

373