Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కేమియుత్తర మొసఁగుదు నిపుడు మఱియుఁ, గైకచేఁ బీడితుండ నై కాననమున
కనిచితి నటంచుఁ జెప్పుదునా యటైన, సత్యవిచ్ఛిత్తి కేనోర్వఁజాలు టెట్లు.

320


సీ.

అనిశముఁ బ్రియపుత్రయును బ్రియవాదిని ప్రియకామయును మహాప్రియయు వైన
కౌసల్య యయ్యయికాలంబులను దాసియనువున సఖియట్ల జననిపగిది
భగినిచందంబుని భార్యపోలిక నొప్పు నట్టికాంత గుమారుఁ డడవి కేగు
చుండ నన్నే మని యొప్పిదంబులు పల్కు నీదృశం బగుపాప మేను జేసి


తే.

యే మని ప్రియంబుఁ జెప్పుదు నంతకాల, మేను నీయందుఁ జేసినహితము నన్నుఁ
బరితపింపఁగఁ జేసె నపథ్యభోజ, నంబు విషరోగినిం బలె నాతి నేఁడు.

321


వ.

మఱియు సత్కారోచిత యైనయక్కౌసల్య భవద్విప్రియశంకచే నాచేత నొ
క్కనాఁ డైన సత్కరింపం బడినయది గా దయ్యె నదియునుం గాక.

322


క.

వనసంప్రయాణరూపా, వనిజాప్రియవిప్రియంబు వదలక విని గ్ర
క్కున నలసుమిత్ర న న్నే, మని మనమున విశ్వసించు నక్కట చెపుమా.

323


వ.

సకలలోకానందకరుం డైనరామభద్రునిఁ బరిత్యజింపం దలంచిన దశరథుం
డింక నేమి యకార్యంబుఁ గావించుటకు వెఱచు నని ధిక్కరింపదే యని వెండి
యు ని ట్లనియె.

324


ఆ.

విపినవాసి యైనవిభుని లోకాంతర, వాసి యైననన్ను పరుసతోడ
జనకరాజపుత్రి వినుటకు నెట్లోర్చు, నకట రెండు నప్రియములు గావె.

325


తే.

పతివిపినయాత్రయును నాదుపంచతయును, విని మహీసుత గృపణ యై వెండికొండ
క్రేవఁ గిన్నరుఁ బాసిన కిన్నరిక్రియ, వెతలఁ బొంది ప్రాణంబులు విడువ కున్నె.

326


క.

వనమునకుఁ జనినరాముని, వనగతుఁ డగువిభునిఁ గూర్చి వగచుమహీజం
గనుఁగొని యేను ధరణిపై, వనితా చిరకాల మింక బ్రతుకఁగఁ జాలన్.

327


క.

జననుతుఁ డగురాముని వన, మునకుఁ బనిచి నన్ను దుఃఖమునఁ జంపి రయం
బున భరతుఁ గూడి మోదం, బున విధవా రాజ్య మేలఁ బూనితొ బుద్ధిన్.

328


తే.

అసతి వగు నిన్ను మది సతి వనుచు నమ్మి, విదప దుఃఖార్తి నిట్లు తపింపవలసె