Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణుండు మిక్కిలి యవాచ్యం బైనరామునివనవాసంబును భరతునిరాజ్యాభి
షేకంబును విని పరిమశోకాక్రాంతచిత్తుం డై కోపంబునఁ గొండొకసేపు ఱెప్ప
వ్రేయక యప్పడంతిమొగంబుఁ దప్పక చూచుచు నిశ్చేష్టితుం డై యూర
కుండి వెండియు నద్దేవివ్యవసాయంబును దాను జేసినశపథంబునుం దలంచి
యశక్యప్రతిక్రియం బగుటవలన నించుకసేపు ధ్యానంబుఁ జేసి రామా యని
నిట్టూర్పు పుచ్చి సన్నిపాతాదులచేత విపరీతప్రకృతి యైనవానిచందంబున
వ్యాధిగ్రస్తుం డైనవానిపోలిక నున్మత్తునికైవడి మంత్రాహృతవీర్యం బయిన
మహాసర్పంబుభంగి నష్టచిత్తుం డై పరశుచ్ఛిన్నం బైనతరువుమాడ్కి ధరణి
పయిం బడి కొండొకసేపునకు లబ్ధసంజ్ఞుం డై వెండియు దీనవాక్యంబున
ని ట్లనియె.

310


క.

రమణి యనర్థం బర్థా, ర్హముగా నెవ్వాఁడు గఱపె నకట పిశాచా
క్రమగతమతివలె దుర్వా, క్యముఁ బల్కుట కోడ వెంత యవివేకినివో.

311


క.

ఈసద్వృత్తభ్రంశము, నేసరణి న్ము న్నెఱుంగ మిప్పుడు చెనటీ
యీశీలము విపరీతం, బై సర్వముఁ గానఁబడియె నటు నీయందున్.

312


క.

నీ కీభయంబు వొడముట, కేకారణ మాత్మసుతున కీశత్వము సీ
తాకాంతునకు వివాసన, మేకరణిం గోరితివి విహీనప్రజ్ఞా.

313


తే.

మగఁడ నగునాదుసుతునకు జగమునకును, దప్పక ప్రియంబుఁ గావింపఁదలఁచితేని
రామవనవాసభరతసామ్రాజ్యరూప, మైన యీపాపభావంబు మాను మిపుడు.

314


క.

రామునియం దపరాధం, బేమి విలోకించి పలికితే నీ కిపుడే
నేమి విరోధముఁ జేసితి, నీమాటలు నీతిశాస్త్రనిర్ణీతములే.

315


తే.

అతివ నాచిత్త మెరియించు టంతెకాని, రాముఁడు భరింపఁదగినసామ్రాజ్యభార
మేల భరతుఁడు పూను సీతేశుకంటె, భరతుఁ డధికుఁడు నృపనీతిపరతఁ జేసి.

316


తే.

అనఘ వనమున కీవు పొమ్మనిన యంత, రాహుసంగ్రస్తుఁ డగునుడురాజుపగిదిఁ
గడువివర్ణత నొందినకౌసలేయు, వదన మేరీతిఁ గనుఁగొనువాఁడఁ జెపుమ.

317


ఆ.

మఱియు సకలరాజమధ్యంబునఁ బ్రధాన, హితులఁ గూడి నిశ్చయింపఁబడిన
దాని శత్రురాజదళితసైన్యమునట్ల, కలుషచిత్త యెట్లు గ్రమ్మఱింతు.

318


వ.

అదియునుంగాక.

319


సీ.

జడబుద్ధి యైనదశరథుండు చిరకాల మెత్తెఱంగున రాజ్య మేలె ననుచు
గుణవంతు లగురాజకుంజరు ల్నను వెలిఁ బెట్టరే జానకీప్రియుని యుత్స
వముఁ జూడ వచ్చిన వసుమతీధవులు రాఘవుఁ డాజిచే నేమి కారణమున
నిర్వాసితుం డయ్యె నేఁ డని రాము నుద్దేశించి పలికినఁ దిరిగి వారి