Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

సకలజనులు రాముఁ డకలంకగుణధాముఁ, డనుచు సన్నుతింతు రట్టిపుణ్యు
నందు నేమి నేర మొందించి ఘోరకా, ననమునం జరింపఁ బనుపువాఁడ.

284


ఆ.

పుడమి నైన రాజ్యభోగసంపద నైన, బలము నైనఁ బ్రాణపవను నైన
నాసుమిత్ర నైనఁ గౌసల్య నైనను, విడుతుఁ గాని యతని విడువఁజాల.

285


ఆ.

అగ్రపుత్రుఁ డైనయవనిసుతాపతిఁ, గనిన నాదుప్రీతి ఘనత కెక్కు
నతనిఁ గాన కున్న నబల మచ్చిత్త మా, నందరహిత మగుచుఁ గుందుచుండు.

286


తే.

పన్నుగ సరోజసఖుఁడు లేకున్న జగము, నీరు లేకున్న సస్యంబు నిలుచుఁ గాని
రమణి రాముఁడు లేకున్న నిమిషమయిన, నాదుతనువునఁ బ్రాణంబు పాదుకొనదు.

287


క.

అటుగావున నీపదములు, పటురయమున శిరము సోఁకఁ బ్రణమిల్లెద నీ
విటు క్రూరచింత సేయక, కుటిలాలక యొండుకోర్కి గోరు మొసఁగెదన్.

288


తే.

పరమదారుణ మయిన యీపాప మెట్టు, లకట నీచేతఁ జింతితం బయ్యె నేఁడు
పుణ్యవర్ధనుఁ డైనరామునకు నెగ్గుఁ, దలఁచుదానికి నిహపరంబులును గలవె.

289


వ.

దేవి నీ విప్పు డాడినవాక్యంబు భరతప్రియాప్రియవిషయంబునందు మచ్చి
త్తంబుఁ బరీక్షించుట కని తలంచెద నదియె భవదభిప్రాయం బేని భరతాభి
షేకంబే గోరవలయుం గాని రామునివివాసనంబుఁ గోర నేల తొల్లి నీవు
రాముండు నాకు జ్యేష్ఠపుత్రుండు ధర్మజ్యేష్ఠుం డని పలికితి వది ప్రియవాదిని
నగునీచేత రామకృతశుశ్రూషార్థం బొండె మదీయచిత్తంబు భవదాయత్తం
బై యుండుటకు నొండెఁ గథితం బయ్యె నని యిప్పు డూహించెద నట్లు గా
దేని రామాభిషేకంబునకు సంతసింపక శోకసంతస్తచిత్త వై యిత్తెఱంగున
న న్నేల పరితపింపం జేసెద వైనను శూన్యగ్రహంబు సోఁకి తత్పారవశ్యం
బున ని ట్లప్రియంబుఁ బలికితివి గావలయుఁ దొల్లి యొక్కింతైన భవదీయ
చిత్తం బధర్మాయత్తంబు గాకుండు నట్టి వినయసంపన్న వైవనీ విప్పు డీయధర్మ
కార్యం బవలంబించుటవలన ధర్మిష్ఠం బైనయిక్ష్వాకువంశంబునం దనివార్యం
బైనయనర్థంబు సంప్రాప్తం బయ్యెనని తోచుచున్నది ము న్నొక్కింతైన లోక
విరుద్ధం బగుప్రతికూలవాక్యంబు నీవలన విని యెఱుంగనికారణంబున నేఁ
డివ్వాక్యంబు నమ్ముట కనర్హంబై యున్నది నాకు రాముండు భరతసముండని
బహుప్రకారంబుల నాకుం జెప్పుచుందు వట్టిసమచిత్త వైననీకు రాముని
యందు విరోధభావం బెత్తెఱంగున నుత్పన్నం బయ్యె.

290