కైకేయి దశరథుని భరతాభిషేచనరామవివాసనరూపవరద్వయం బడుగుట
సీ. |
భూనాథ యొకవరంబునకు మత్సుతునకు ఘనరాజ్యపట్టంబుఁ గట్టవలయు
వినుము రెండవవరంబునకు రాముఁడు జటాజినచీరధారి యై సిరికిఁ బాసి
తాపసవేషంబుఁ దాల్చి చతుర్దశవర్షము ల్దండకావనమునందుఁ
జరియింపవలయు నిత్తెఱఁగున ఘటియింపు మిదియె నామనమున నిరువుకొనిన
|
|
ఆ. |
కార్య మట్లు గానఁ గడఁగి నీ విప్పుడు, రాఘవాభిషేకలగ్నమందె
పూజ్యయౌవరాజ్యమునకు నాతనయుని, విభునిఁ జేయు మవనివిభులు వొగడ.
| 276
|
చ. |
అఱమర దక్కి యివ్వరము లర్థి నొసంగుము సత్యసంగర
స్థిరుఁడవు గమ్ము జన్మకులశీలములం దగఁ గాచికొమ్ము భూ
వరులకు సత్యమే సిరియు వైభవముం బరలోకసాధనో
త్కరమని తాపసు ల్బహువిధంబులఁ బల్మఱు చాటి చెప్పరే.
| 277
|
వ. |
రాజేంద్రా యేను నీచేత దత్తం బైనవరంబునే యడిగితిం గాని నూతనవరం బడి
గినదానఁ గా నని యిట్లు కర్ణశూలాయమానం బగుదారుణవాక్యంబు పలి
కిన విని కొండొకసేపు నిశ్చేష్టితుం డై చిచ్చుతాఁకునం దపించుమహా
గజంబుపోలిక నేలం బడి పొరలుచు నిజాంతర్గతంబున.
| 278
|
దశరథుండు నానాప్రకారంబులఁ గైకెయిని దూఱుట
క. |
ఊహింప సూక్ష్మకారణ, దేహావస్థ లొకొ రుజయొ తీఱనిచేతో
మోహంబొ గాక తక్కిన, నాహా యే నింతవెఱ్ఱి నగుదునె యకటా.
| 279
|
మ. |
అని చింతించుచు గేహినీవచనవజ్రాభోగ్రనారాచదు
ర్దినసమ్మూర్ఛితమానసుం డగుచు ధాత్రీనాథుఁ డొక్కింతసే
పునకుం దేఱి యసంవృతావనిపయిం బొ ల్పేది కూర్చుండి మో
మున దీనత్వము గానుపింప విపదంభోరాశినిర్మగ్నుఁ డై.
| 280
|
మ. |
ఘనమంత్రౌషధరుద్ధవిక్రమమహాకాలాహిమాడ్కిం గడం
గిననిట్టూర్పు నిగిడ్చి యొంటిమెయి వ్యాఘ్రిం గన్న పెన్నిఱ్ఱిచా
డ్పున భార్యం గని భీతి నొంది మరల న్మూర్భాగతుం డై చిరం
బునఁ దె ల్వొంది సుదుఃఖితుం డగుచు నప్పూఁబోఁడితో ని ట్లనున్.
| 281
|
తే. |
పుత్రగర్ధిని దుష్టచారిత్రకులవి, నాశిని నృశంస జానకీనాథుచేతఁ
బరఁగ నాచేత నేమి పాపం బొనర్పఁ, బడియె నిట్టిదుర్వాక్యంబుఁ బలికె దేల.
| 282
|
చ. |
సతతముఁ దల్లినట్ల బలుచందముల న్నినుఁ గొల్చు జానకీ
పతి కహితంబు సేయ మదిఁ బట్టితి వేమినిమిత్త మేను దు
ర్మతి నగునిన్ను దీక్ష్ణగరలప్రథితోరగినట్ల యిల్లు సే
ర్చితి జడబుద్ధిచేఁ జనువుఁ జేసితి నాత్మవినాశనార్థ మై.
| 283
|