Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కథనమున నన్నుఁ బ్రోవుము కల్ల గాదు, సత్యమాడితిఁ బుణ్యంబు సాక్షి గాఁగ.

272


వ.

అని పలికిన నద్దేవి దశరథుండు తనవలని మోహంపుటురిం దగులుపడియె
నని యూహించి రామశపథపూర్వకస్వవచనక్రియావాక్యంబున సంహృష్ట
యగుచు నిజపుత్రపక్షపాతంబువలనను సర్వప్రకారంబుల విభుండు తనకా
ర్యంబు సఫలంబుఁ గావించు ననెడుహర్షంబువలనను శత్రువుల కైన వచించుట
కశక్యం బైనదాని నభ్యాగతాంతకునిచందంబున నతిఘోరం బగుదానిఁ
బుత్రాభిషేచన రామనివాసన రూపాభిప్రాయం బెఱింగించెదఁ గా కని నిశ్చ
యించి రాజప్రతిజ్ఞ దుష్కరదారుణప్రయోజనవిషయం బగుటవలన విఫల
త్వంబు నొందునో యని శంకించి దాని నశేషసాక్షికరణంబున సుస్థిరత్వంబు
నొందింపం దలంచి భర్త నుద్దేశించి దేవా యిప్పుడు సకలభూతంబులును జం
ద్రాదిత్యాదిగ్రహంబులును నగ్నిపురోగము లైనదేవతలును భూమ్యంతరిక్ష
దివంబులును దిక్కులును నహోరాత్రంబులును గంధర్వరాక్షరాదిదేవయోని
విశేషంబులును నిశాచరభూతంబులును గృహదేవతలును సాక్షిగాఁ బ్రియపుత్ర
సుకృతాదిపరిగ్రహక్రమంబున శపథంబుఁ జేసితివి తత్పూర్వకం బగువరంబు
నా కొసంగితివి నీవు సత్యసంధుండవు ధర్మజ్ఞులలో నుత్తముఁడవు మహాతేజుం
డవు సకలభూతసమక్షంబున నీపలికినపలుకు లర్థవంతంబులు సేయుటకు సంది
యంబు లేదు గదా యని యిట్లు దశరథుని స్వమతంబునందు సంస్థాపించి సత్య
సంధాదివిశేషణంబుల స్వవచనకృతిస్థైర్యంబుకొఱకుఁ బ్రశంసించి నిజాభిప్రా
యంబు దేటపడ ని ట్లనియె.

273


సీ.

అవనీశ తొల్లి దేవాసురసంగ్రామమున శంబరుం డనుదనుజవరుని
చే నష్టసంజ్ఞుఁడ వైననీ వవుడు నాచే రక్షితుండ వై చిత్తమందు
మెచ్చి వరద్వయ మిచ్చెద నంటివి తఱి యగునంతకుఁ గరము నమ్మి
నీయొద్ద డాఁచితి నేఁ డవ్వరంబులు దయ సేయు మటు గాక తక్కెనేని


తే.

నేఁడె మదుపేక్షకుఁడ వైననీవు చూడ, జీవితంబులు విడిచెద సిద్ధ మట్లు
గాన నను జక్కఁ గొనుకోర్కి గలిగెనేని, వరము లొసఁగి యభీష్టము ల్వడయు మిపుడు.

274


వ.

అని పలికిన నద్ధశరథుండు విశేషంబుగాఁ బరస్వరూపం బుక్తంబు గా కున్నను
బూర్వదత్తవరస్మారకవచనమాత్రంబునఁ గైకేయీవశీకృతుండై మృగశబ్దాను
కరణలుబ్ధకవాక్యంబున వశీకృతం బైనమృగంబు వాగురాదిపాశంబునం దగులు
వడినచందంబున ననుకూలవరప్రదానాభ్యుపగమసంజ్ఞం బగుపాశంబునం దగులు
వడియె ని ట్లమ్మహీపతిని సత్యపాశబద్ధుం గావించి కైకేయి వెండియు ని ట్లనియె.

275