Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశరథుఁడు కైకేయీగృహంబునకు వచ్చుట

చ.

ఇనకులవార్ధిశీతకరుఁ డెల్లి జను ల్విన రాఘవాభిషే
చన మని తెల్పి యవ్వలను సభ్యుల వీడ్కొని తత్ప్రియప్రయో
జనముఁ బ్రియార్హ యైనగుణశాలికిఁ గైకకుఁ దెల్పువేడ్కఁ జ
య్యనఁ జనియెం దదీయవిపులాయతనంబున కాతఁ డున్నతిన్.

249


వ.

అది మఱియును.

250


సీ.

క్రౌంచమరాళసారసనాదయు క్తంబు శుకపికశారికాశోభితంబు
చంపకాశోకరసాలప్రసవగంధమిళితలతాగృహవిలసితంబు
తపనీయరౌప్యవితర్దికాలంకృతరమ్యనిశాంతవిరాజమాన
మమృతోపమానభక్ష్యాన్నపానాదికసరసపదార్థోపసంభృతంబు


తే.

నిత్యపుష్పఫలోపేతనిఖిలతరువి, కాసితోద్యానసహితంబు కనకరత్న
భూషణవిభూషితంబు నై పొసఁగ నింద్ర, కాంతసదనంబుక్రియ మనఃకాంత మగుచు.

251


క.

వాపీకూపంబులచే, నాపాండురదాంతరాజతాసనములచే
నేపారెడు కుబ్జలచే, దీపించెడుదాని రుచులఁ దేలెడుదానిన్.

252


క.

కైకేయిగృహముఁ గనుఁగొని, ప్రాకటముగ రాహుయుక్తపాండుఘనచ్ఛ
న్నాకాశముఁ జేరెడు దో, షాకరుగతి నమ్మహార్హసదనముఁ జేరెన్.

253


వ.

ఇట్లు ప్రవేశించి.

254


ఆ.

కామబలయుతుండు గావున సురతసు, ఖంబుఁ గోరి తృష్ణ గదుర శయ్య
కడకుఁ బోయి యందుఁ గైకేయిఁ గానక, మనుజవిభుఁడు తనదుమానసమున.

255

దశరథుఁడు కైకేయిఁ గానక పరితపించుట

సీ.

రమణి నిత్యము మదాగమనవేళ యెఱింగి మాల్యచందనచేలమండనములఁ
గయిసేసి మోహనాకారమై నారాక కెదురు సూచుచునుండు నిప్పు డేల
తొల్లింటిచందానఁ దొయ్యలి చూపట్ట దని విషాదము నొంది యచట నున్న
ప్రతిహారిఁ గనుఁగొని భామిని యెక్కడఁ జెప్పు మీ వన నది చేతు లళిక


తే.

భాగమునఁ జేర్చి దేవరవారిదేవి, యలుక తొడమినడెందాన నల్ల క్రోధ
సదనమున నొంటిఁ గఠినభూశయ్యమీఁద, దీనయయి పడియున్నది దేవ యనిన.

256


వ.

విని యదర్శనమాత్రంబున మొదలు సంప్రాప్తవిషాదుం డై యున్న యన్నర
పతి క్రోధాగారప్రవేశశ్రవణంబువలన ద్విగుణీకృతవిషాదుం డై లుళితవ్యాకు
లేంద్రియుం డగుచు మెల్లనఁ గ్రోధాగారంబులోనికిం జని యందు వినిష్కృత్త
యై నలతికపగిదిఁ బుణ్యక్షయంబువలన స్వర్గంబున నుండి పుడమిం ద్రెళ్లిన