Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గతజలసేతుబంధనముకైవడి శూన్యనివాసదీపసం
గతి యగుఁ గాన నాపనుపుఁ గైకొని వేగమె జేయు మిత్తఱిన్.

245


ఆ.

అనిన నట్ల కాక యని కైక రయమునఁ, గుబ్జతోడఁ గూడి క్రోధగృహము
సొచ్చి మైలఁ గట్టి సొమ్ము లుర్వర వైచి, ధర వసించి మరల దాని కనియె.

246


చ.

క్షితితనయావిభుండు వనసీమకుఁ బోవుచునుండ మత్సుతుం
డతులితపూజ్యరాజ్యవిభుఁ డయ్యె నటం చల కేకయావనీ
పతి కెఱిఁగింపు కానియెడఁ బ్రాణసఖీ మది నుక్కు దక్కి నా
మృతి నెఱిఁగింపుమా దశరథేశున కాతనియుల్ల ముబ్బఁగన్.

247


వ.

అని యి ట్లతిక్రూరంబుగాఁ బలికిన నక్కుబ్జ తనతలం పీడేఱె నని మనంబున
నుబ్బుచు రాముండు రాజ్యస్థుండైన నీకుఁ జేటు వాటిల్లుం గావున నెల్లభం
గుల నతండు వనంబునకుం జను నంతకు నిమ్మౌర్ఖ్యంబు విడువ కుండవలయు
నని యక్కైకకు నొత్తి చెప్పిన నద్దేవి మహాక్రూరంబు లగుతదీయవచశ్శిలీము
ఖంబుల ముహుర్ముహుర్లుఠితాంతరంగ యగుచు హస్తంబు లురంబున నిడి
కొని యమ్మంథరమతంబునకు బహువారంబులు కైవారంబులు సేయుచు
సీతావల్లభున కరణ్యవాసం బొండె నాకు జీవితాంతం బొండె నందాఁక నీయ
లుక డింపక యుండుదాన నదియునుంగాక నిక్కార్యం బొడఁబడు నందాఁక
భోజనమజ్జనపానశయనాదు లుడిగి స్రక్చందనాదిపదార్థంబులం దాస మాని
దివ్యాంబరాభరణాదులం గైసేయకుండెద నని నిష్ఠురంబుగాఁ బ్రతిజ్ఞ జేసి
సర్వాభరణంబులు పుడమిం బడవైచి పుణ్యాంతంబునందు దివంబున నుండి
నేలం బడిన కిన్నరాంగనతెఱంగున ననాప్తరణసంవృతమేదినిపయిం బడి
యుండె నప్పు డప్పడంతి యుదీర్ణసంరంభతమోవృతముఖయును విముక్తముక్తా
మాల్యవిభూషణయు నై యస్తమితతారకంబై తమశ్ఛన్నం బైననభంబు నను
కరించి నప్పు డక్కుబ్జ మణికాంచనవిచిత్రంబు లైనతదీయదివ్యాభరణం
బులు కీలుడిపి యెల్లకడలం జల్లె నవి నక్షత్రంబులు నభంబును బోలె నచ్చటి
వసుంధరను బ్రకాశింపంజేసె ని ట్లేకవేణియును విముక్తభూషణాంబరయు నై
కేకయరాజపుత్రి విపరీతార్ధబోధిత యై యొంటి నేలం బడి నాగాంగనభంగి
నూర్పులు వుచ్చుచు మంథరోపదిష్టకార్యంబు యుక్తం బని నిశ్చయించి మన
చేత నాలోచితం బైనసర్వంబు సమీచీనం బని మెల్లన మంథరకుం జెప్పుచు
నిజోద్యోగం బగునో కాదో యని నిశ్చయాభావంబువలన దీనయై సారెసా
రెకు నాత్మసుఖావహం బైన తన్నిశ్చయోపాయం బొక్కముహూర్తంబు
చింతించి నిశ్చితార్థయై భ్రుకుటిబంధోదీర్ణవదనయై యుండె నప్పు డక్కుబ్జ కైకే
యీకృతకార్యనిశ్చయం బెఱింగి రససాధనాదిసిద్ధి నొందినదానితెఱంగునఁ
బరమప్రీత యయ్యె నంత.

248