Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనించుఁ బ్రాజ్ఞు లైనరామభరతాదులయందు జనించుట కేమి యరిది యట్టి
సన్నికర్షంబు నీచేత విఘటితం బయ్యె లక్ష్మణుండు రామునకుం బోలె శత్రు
ఘ్నుండు భరతునకు వశుండై యుండు నతం డైన సమీపంబున నున్నఁ దనయ
స్నేహంబువలన భరతునియందు సౌహార్దంబు గలుగు నతండును బ్రస్థాపితుం
డయ్యె వనోద్భూతతృణకాష్ఠజీవు లగువ్యాధాదులచేత ఛేత్తవ్యం బగుకొం
డొకవృక్షంబు కంటకప్రచురవేత్రతృణలతాదులచేత సన్నికర్షంబువలన ఛేదన
రూపభయంబువలన సమోచితం బగునని వినఁబడుం గావున సన్నికర్షంబు రక్షణ
కారణం బై యుండునది నీచేతఁ బరిహృతం బయ్యెనని విందుముగాదె యని
పలికి వెండియుఁ గుబ్జ యి ట్లనియె.

208


తే.

రాఘవుఁడు లక్ష్మణునిఁ బ్రోచు లక్ష్మణుండు, ప్రోచు రాముని నశ్వినీపుత్రులట్ల
వారిసౌభ్రాత్ర మఖిలభువనమునందు, నధికవిశ్రుత మై యుండు నట్టు లగుట.

209


క.

సౌమిత్రిపై రఘూత్తముఁ, డేమియుఁ బాపంబు సేయఁ డించుక యైనన్
లేమా మనభరతునిఁ బెనుఁ, బాముపగిదిఁ గినుకఁ బూని బాములఁ బెట్టున్.

210


వ.

కావున భవత్కుమారుండు మాతులగృహంబుననుండి వనంబునకుం జనుం
గాక భరతుండు ధర్మంబు దప్పక పిత్ర్యం బగురాజ్యంబుఁ బరిపాలించెనేని
నాకుఁ బరమహితంబును నీ కత్యంతహర్షంబును భవదీయజ్ఞాతుల కధికోదయం
బును సంభవించు నదియునుంగాక.

211


తే.

అతిసుఖోచితుఁ డగుభవత్సుతుఁడు రామ, చంద్రునకుఁ జూడఁ గేవల సహజశత్రుఁ
డతఁడు సతతసమృద్ధార్థుఁ డగుచు నుండ, నితఁడు నష్టార్థుఁ డై యెట్లు బ్రతుకుఁ దన్వి.

212


క.

వనితా బలుసింగముచే, వనమున వెస నాక్రమింపఁ బడినకరివిధం
బున రామునిచేఁ బొదువఁ బ, డిన భరతునిఁ బ్రోవు మతని డెందం బలరన్.

213


మ.

రమణీ మున్ను విభుండు నీకు వశుఁ డై లాలించునాఁ డీవు గ
ర్వమునం జేసినయెగ్గు లన్నియును దాఁ బల్మాఱు చింతించి గి
న్క మదిన్ డాఁచిన నీసపత్ని యగునక్కౌసల్య రాముండు రా
జ్యము బాలించుచు నుండె నేనియు నినున్ సాధింపదే క్రమ్మఱన్.

214


తే.

రామచంద్రుండు సకలసామ్రాజ్యమునకు, నాయకుం డయ్యె నేని నీనందనునకు
నీకు నీబంధుజనుల కస్తోకదైన్య, వృత్తి వాటిల్లు నిక్కువ మివ్విధంబు.

215


క.

కావున భరతుని రాజ్య, శ్రీవిభునిఁ గఁ బగతుఁ డైన శ్రీరాము నర
ణ్యావాసునిఁ గాఁ దలఁవుము, భావంబున సుతుఁడు నీవు బ్రతుకఁ దలఁచినన్.

216