క. |
అనఘాత్మ శరీరుల నె, మ్మనములు దలపోయ నిమిషభంగురములు గా
వునఁ దలఁచిన పని యప్పుడె, యనుకూలము చేయవలె నమంచితబుద్ధిన్.
| 121
|
వ. |
అట్లు గావున నాలస్యంబుఁ జేయుట కర్జంబు గాదు నేఁడు చంద్రుండు పునర్వసు
నక్షత్రసహితుఁ డై యున్నవాఁ డెల్లి పుష్యయోగంబు నియతం బని దైవజ్ఞు
లాదేశించిరి కావున నమ్మహనీయశుభలగ్నంబునందు సకలమహీరాజ్యంబున
కభిషిక్తునిం జేసెద నేఁటిరాత్రి సీతాసమేతంబుగా దర్భప్రస్తరశాయి వగుచు
నుపవసింపు మేతాదృశశుభకార్యంబుల కనేకవిఘ్నంబులు సంభవించు నట్లు
గాకుండ నప్రమాదు లగుసుహృజ్జను లెల్లెడలం గాచికొని యుండువారు గా
నియోగింపు మని పలికి యద్దశరథుండు దొల్లి కేకయరాజునకు రాజ్యం
బుంకువఁ జేసి కైకేయిని బెండ్లి యైనవాఁడు గావునఁ దద్వృత్తాంతంబు మనం
బున నిడికొని వెండియు.
| 122
|
క. |
భరతుఁడు గ్రమ్మఱఁ బురమున, కరుదేరక మున్నె రఘువరా నీవు మహీ
వరుఁడ నగు టొప్పు నని యే, నరయుదుఁ జిత్తంబునందు ననవరతంబున్.
| 123
|
దశరథుఁడు భరతునిగుఱించి శంకించుట
వ. |
అని యిట్లు భరతునిసాధువృత్తంబు నెఱింగియు రామస్నేహంబువలన రాజ్యం
బుకొఱకు నెట్లు తనచిత్తంబును శంకించె నట్లు భరతచిత్తంబును శంకించి పలికి
సద్గుణయుక్తుం డైనభరతునం దిట్టిశంక యుక్తంబు గా దని పలుకునో యని
యాలోచించి తత్పరిహారంబుకొఱకు మరల ని ట్లనియె.
| 124
|
చ. |
అనఘుఁడు ధర్మశీలుఁడు దయాహృదయుండు జితేంద్రియుండు నై
తనరు నతండు సాధులపథంబు మనంబునఁ బట్టి నీయెడ
న్ఘనతరభక్తిగౌరవముఁ గల్గినవాఁ డగు నైన నేమి యీ
మనుజులచిత్త మస్థిరము మాటికి నమ్మఁగరాదు తద్గతిన్.
| 125
|
తే. |
కుజనులమనంబె కాక యక్రూరజనుల, మనము చపలత్వ మొందునే యనఁగ వలదు
సత్యధర్మాభిరతు లైనజనులచిత్త, మైనఁ గృతశోభి యగు నిక్క మనఘచరిత.
| 126
|
వ. |
అని పలికి వీడుకొల్చినఁ దండ్రిచేత ననుజ్ఞాతుం డై రాముండు దచ్చరణంబు
లకుం బ్రణమిల్లి నిజనివాసంబునకుం జని యమ్మహోత్సవంబు నిజజనని కెఱిం
గించుతలంపునఁ బదంపడి తదీయమందిరంబునకుం జని యందు.
| 127
|
శ్రీరాముఁడు దశరథాభిప్రాయంబుఁ గౌసల్యకుఁ దెల్పుట
క. |
రాముండు గనియెఁ బూజా, ధామంబున క్షౌమపటముఁ దాలిచి నియతిం
దామోదరుఁ దలఁపుచు ను, ద్దామశ్రీఁ గోరుచున్న తల్లిని బ్రీతిన్.
| 128
|