|
వినమితగాత్రు రాఁ బనిచి వెండియు రామునిఁ దోడి తెమ్ము నీ
వనిన మహాప్రసాద మని యాతఁడు రామునిదివ్యమందిరం
బునకు రయంబునం జనియె మోమున సంతస మంకురింపఁగన్.
| 110
|
సుమంత్రుఁడు వెండియు దశరథునికడకు రాముని దోడితెచ్చుట
వ. |
ఇవ్విధంబునం జని దౌవారికులచేతఁ దనరాక నెఱింగించిపుచ్చిన నారాముండు
శంకాసమన్వితుం డగుచు నతని రయంబున రావించి యి ట్లనియె.
| 111
|
క. |
అనఘాత్మ నీదురాకకుఁ, బని యెయ్యది యనిన రాజు పదపడి మిముఁ గ
న్గొనఁ దో డ్తెమ్మన వచ్చితిఁ, బని గలిగిన వినఁ దగు న్నృపాలునివలనన్.
| 112
|
క. |
అన విని రాముఁడు గ్రమ్మఱ, జనకునిఁ గనువేడ్క మదిని సందడి పెట్ట
న్ఘనరాజభవనమునకుం, జనియె నతఁడు వెంట నడువ సత్వరుఁ డగుచున్.
| 113
|
క. |
వచ్చినతనయునిఁ గనుఁగొని, ముచ్చట పడి దశరథుండు మోమున మోదం
బచ్చుపడఁగ రుచిరాసన, మిచ్చి హితము దోఁపఁబలికె మృదుమధురోక్తిన్.
| 114
|
ఉ. |
మించినవేడ్కతో జనులు మెచ్చఁగఁ బెక్కుదినంబు లుర్వి జీ
వించినకారణంబునఁ బ్రవృద్ధుఁడ నైతి ననారతంబు న
భ్యంచితభూరిదక్షిణల నన్నవదిష్టిశతంబు లుర్విఁ గా
వించితి సంతతం బనుభవించితి నీప్సితభోగభాగ్యముల్.
| 115
|
తే. |
అట్టి సకలార్థసిద్ధుండ నైననాకు, నిరుపమేష్టుసుతుండ వై నీవు ప్రీతిఁ
బుట్టితివి గాన నాచేతఁ బుత్రవర్య, దత్త మగురాజ్యము భరింపఁదగుదు వీవు.
| 116
|
వ. |
మఱియు నభీష్టంబు లగువీరసుఖంబులు నాచేత ననుభూతంబు లయ్యె యాగా
ధీతపుత్రదత్తసుఖోపభోగంబుల చేత దేవర్షిపితృవిప్రాత్మఋణంబులవలన విము
క్తుండ నైతి నింక భవదభిషేకంబుకంటె నొండుకార్యం బెద్దియుఁ గొఱంత
లేదు కావున నే నెద్ది గఱపిన దానిం గా దనక చేయవలయు నని పల్కి వెండి
యు ని ట్లనియె.
| 117
|
తే. |
అనఘ యిప్పుడు ధారుణీజనము లెల్ల, నిన్నుఁ బతిఁగా దలంచుచు నున్నవారు
గాన యువరాజపట్టంబు గట్టెదను భ, రింపుమా సర్వభూభార మింపు మెఱయ.
| 118
|
సీ. |
అనఘాత్మ ఘనతారుణాశుభంబులు పెక్కు కలలోన నిప్పుడు కానఁబడియెఁ
జటులనిర్ఘాతనిస్వనమహోల్కాతతు ల్పడసాగె మత్తారభౌమరాహు
రవిముఖదారుణగ్రహములచే నవష్టబ్ధ యయ్యె నటంచు సకలదైవ
చింతకు లిప్పుడు చెప్పిరి గావున నిట్టియుత్పాతము ల్పుట్టు టెల్ల
|
|
ఆ. |
నవనిపతికిఁ జేటు నగుఁ గానిచో మితి, పెట్టరానివగవు పుట్టు నింక
నిట్టిదశలలోన నెద్ది బొందక మున్నె, ధారుణీభరంబుఁ దాల్పు పుత్ర.
| 119
|