Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ప్రకృతిచేతనె మిక్కిలి రామ నీవు, విమలగుణరాశి వైతివి వేఱె చెప్ప
నేటి కైనను గృప నొక్కహితము నీకుఁ, దెలియఁ జెప్పెద వినుము సందేహ ముడిగి.

98


తే.

వినయ మూఁది జితేంద్రియవృత్తి గలిగి, యంగనాదికకామజవ్యసనములను
వాక్పరుషతాదికోపజవ్యసనములను, విడువు మిది నీతివిదుఁ డైనవిభునిగుణము.

99


తే.

మఱియుఁ బ్రత్యక్షవృత్తిచే మంత్రివరుల, నింపు సొంపార నెపుడు రంజింపు మీవు
తక్షముఖసర్వజనులఁ బ్రత్యక్షపదముఁ, జేర్పక పరోక్షవృత్తి రంజింపు వత్స.

100


వ.

మఱియుఁ గోష్ఠాగారాయుధాగారంబులతోఁ గూడఁ బ్రశస్తవస్తునిచయంబులు
సంపాదించి.

101


క.

కర మనురక్తప్రకృతిత, ధరణిం బాలించు నెవఁ డతనిమిత్త్రు లొగిన్
బరమానందము నొందుదు, రరమర లే కధిగతామృతామరులక్రియన్.

102


క.

కావునఁ గుమారవర యీ, భావము భావంబునందు భద్రంబుగ సం
భావించి ప్రజల నందఱఁ, బ్రోవుము జగదేకరాజపూజ్యుఁడ వగుచున్.

103


క.

అని పలుక నతనిపలుకులు, విని యచ్చట నున్నరామవిభునాప్తులు వే
చని కౌసల్యకుఁ జెప్పిరి, ఘనమతి రామాభిషేకకథ ముద మలరన్.

104


క.

ప్రమదారత్నం బగున, య్యమ నానారత్నకాంచనాంబరధేనూ
త్తమమాల్యహారములు నె, య్య మెలర్పఁగఁ బ్రీతిఁ దత్ప్రయాఖ్యుల కొసఁగెన్.

105


క.

అంత ధరిత్రీతనయా, కాంతుఁడు జనకునకు మ్రొక్కి కాంచనరథ మ
త్యంతముదంబున నెక్కి ని, జాంతఃపురమునకుఁ జనియె ననుచరయుతుఁ డై.

106


ఉ.

పౌరులు మేదినీవిభుఁడు పల్కినవాక్యము లాలకించి యా
ధారుణినాథు వీడ్కొని ముదంబున నిండ్లకుఁ బోయి యందు సీ
తారమణీవిభుండు వసుధాధిపుఁ డయ్యెడు నంచు నెంచుచున్
సారమతి న్సురార్చనలు సల్పిరి భక్తినిబద్ధచిత్తు లై.

107


క.

అట దశరథనృపరజనీ, విటుఁడు ప్రధానయుతుఁ డగుచు వెండియు హర్షో
త్కటమున మంత్రం బొనరిచి, పటుమతి నిశ్చయముఁ జేసి పదపడి పలికెన్.

108


క.

ఎల్లి తగఁ బుష్య యోగం, బల్లన జలజారుణాక్షుఁ డగుజనకసుతా
వల్లభుని నిఖిలజగతీ, వల్లభునిం జేయువాఁడ వరమతులారా.

109


చ.

అని యిటు లానతిచ్చి విభుఁ డాత్మగృహంబున కేగి సూతునిన్