క. |
కని తృప్తి నొందఁ డయ్యెను, మనమున ఘర్మాభితప్తమనుజులను ముదం
బునఁ బొదలఁ జేయు పర్జ, న్యునిక్రియ నలరారు నందనుని సుందరునిన్.
| 91
|
వ. |
మఱియు గంధర్వరాజప్రతిముఁ డగువాని విఖ్యాతపౌరుషుం డగువానిఁ బౌరు
పోషయుక్తసమానసత్త్వమహాదీర్ఘబాహుం డగువాని మహాసత్త్వుం డగు
వానిఁ దదనుగుణవిశేషమత్తమాతంగగమనుం డగువానిఁ జంద్రకాంతాననుం
డగువాని నత్యంతప్రియదర్శనుం డగువాని రూపౌదార్యగుణంబులచేతఁ
బురుషులదృష్టిచిత్తాపహారకుం డగువాని తనసమీపంబునకు వచ్చుచున్న
వానిఁ బ్రతిక్షణదర్శనంబున నవనవప్రేమాస్పదుం డగువాని రామభద్రుని
నిర్నిమేషదృష్టి నవలోకించి పరమానందభరితాంతఃకరణుం డై యుండె
నప్పుడు.
| 92
|
క. |
అంత సుమంత్రుఁడు సీతా, కాంతుని యరదంబు దిగిచి కడువేడుక గు
ర్వంతికమున కరుగునతని, చెంతం బనె నొసలఁ గేలు సేర్చి ముదమునన్.
| 93
|
చ. |
జనకసుతావిభుండు నృపసత్తముఁ గన్గొనువేడ్కతో గిరీ
శనగసమాననవ్యఘనసౌధముమీఁదికి నెక్కి భక్తిచే
జనకుపదాంబుజంబులకు జాఁగిలి మ్రొక్కి తదంతికంబునం
దనుపమలీల నుండె ఘటితాంజలి యై వినయంబు దోఁపఁగన్.
| 94
|
వ. |
ఇవ్విధంబునం దనకు నమస్కరించి పార్శ్వభాగంబునం గొలిచి యున్నకు
మారశేఖరు నవలోకించి బాహువుల నాకర్షించి కొండొకసేపు గాఢాలింగ
నంబుఁ గావించి పదంపడి దివ్యకాంచనమణిభూషితరుచిరపీఠంబునం గూర్చుండ
నియోగించిన నాసీనుం డై విమలుం డగుసూర్యుం డుదయంబునందు సుమేరు
శైలంబునుంబోలె స్వశరీరకాంతిచేత నయ్యాసనంబును భాసమానంబుఁ
గావించె మఱియుఁ దత్సభామండపంబు వసిష్ఠదశరథాదిబ్రహ్మర్షిరాజర్షులచేత
భ్రాజమానం బయ్యును విశేషించి రామునిచేత విమలగ్రహనక్షత్రశోభిత
శారదాకాశంబు సంపూర్ణచంద్రునిచేతంబోలె నుద్దీపితం బై యుండె నిట్లు
సుఖోపవిష్టుం డైనప్రియకుమారు నవలోకించి యాదర్శతలసంస్థితుఁ డైన
తన్ను విలోకించి యలరుమనుజునిమాడ్కి దశరథుండు సంతోషించి
మందహాససుందరవదనారవిందుం డై కాశ్యపుండు పురందరునకుంబోలె గౌస
ల్యానందనున కి ట్లనియె.
| 95
|
దశరథుఁడు శ్రీరాముని ధరణీభారంబు వహింప నియోగించుట
ఆ. |
రామభద్ర నీవు రమణతో ననురూప, పత్ని యగుమదగ్రపత్నియందు
సదృశసుతుఁడ వగుచు జనియించితివి నాకు, సకలసద్గుణముల సత్ప్రియుఁడుగ.
| 96
|
తే. |
ధారుణీప్రజ లెల్ల నీచే రమింపఁ, బడిరి కావున నింక వైభవము మెఱయ
పుష్యయోగంబునం దెల్లి పుడమికెల్ల, నాథుఁడవు గమ్ము జానకీనాథ నీవు.
| 97
|