Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు నంతకుమున్న చనుదెంచి యున్నసుమిత్రాసౌమిత్రి ధరిత్రీపుత్రికలం
గూడి లక్ష్మణునివలన రామాభిషేకవృత్తాంతంబు విన్న దగుట హర్షపుల
కితసర్వాంగి యై కనుంగవ మూసి ప్రాణాయామంబునఁ బరమపురుషుండైన
జనార్దనుని ధ్యానంబు సేయుచున్నతల్లి నవలోకించి తచ్చరణంబులకు నియ
మంబున నభివందనంబుఁ గావించి యనిందిత యగునద్దేవికిఁ బ్రియంబుగా
మధురవాక్యంబున నిట్లనియె.

129


తే.

అంబ రాజ్యపాలనకర్మమందుఁ దండ్రి, చేత నేఁడు నియుక్తుఁడ నైతి నేను
నెల్లి పుష్యయోగమున నహీనరాజ్య, పట్టబద్ధుఁ జేసెద నని పలికె విభుఁడు.

130


వ.

మఱియు నీరాత్రి సీతాసమేతంబుగా నుపవాసం బుండు మని ఋత్విగుపా
ధ్యాయసహితుం డై రాజేంద్రుండు నన్ను నియోగించెం గావున నెల్లి మత్ప
ట్టాభిషేకంబునందు నాకును సీతకు నేయేమంగళకర్మంబు లాచరింపం దగు
నవి యెల్లఁ జేయింపుం డని పలికినఁ జిరకాలాభికాంక్షితం బైనతత్క్రియ
వృత్తాంతంబు విని యానందబాష్పధారాపూరితలోచన యై యిట్లనియె.

131


తే.

అనఘ రామ చిరంజీవి వగుము నీదు, రిపులు హతు లైరి నీవు సుశ్రీయుతుండ
వగుచు నాబంధుజనముల నలసుమిత్ర, బంధువులఁ బ్రోవు మానందపరులఁ జేసి.

132


తే.

వత్స నీచేత మీతండ్రి వరగుణముల, చేత నారాధితుం డయి చెలఁగెఁ గాన
భవ్యనక్షత్రదినమందు భద్రమూర్తి, వై జనించితివి గద నాయందు నీవు.

133


తే.

రామ యిబ్భంగి నిక్ష్వాకురాజ్యలక్ష్మి, యింపు సొం పార ని న్నాశ్రయించెఁ గాన
నచ్యుతునియందు నేఁ జేయునట్టిసువ్ర, తంబు నేఁటి కమోఘ మై తనరెఁ గాదె.

134


క.

అని యిట్లు జనని పలికిన, విని రాముఁడు సంతసిల్లి వినమితతనుఁ డై
తనమ్రోల నున్నలక్ష్మణుఁ, గనుఁగొని యిట్లనియె హాసకలితాననుఁ డై.

135


తే.

అనఘ నాయంతరాత్మ వైనట్టి నిన్ను, రమణతోఁ బొందె నిక్ష్వాకురాజ్యలక్ష్మి
సంతతంబును ననుఁ గూడి సంతసమున, నింపు సొంపార ధాత్రిఁ బాలింపు మింక.

136


తే.

అభిమతాఖలభోగ్యపదార్థరాజ్య, ఫలములను బ్రీతి భుజియింపు మలఘుచరిత
రాజ్యమును జీవితంబును రమణ నెపుడు, మించి భవదర్థ మాత్మఁ గామించుచుందు.

137


వ.

అని పలికి లక్ష్మణుమనంబుఁ గలపికొని తల్లికి నమస్కరించి సీత కనుజ్ఞ
యొసంగి నిజనివాసంబునకుం జనియె నట్లు దశరథుండు వ్రతోపవాసాదికంబుఁ
గావింపు మని రాముని నియోగించి పదంపడి వసిష్ఠు రావించి యి ట్లనియె.

138