|
దఱు భయ మంది రాదశరథక్షితిభర్త వసిష్ఠముఖ్యధీ
వరులను భక్తితో భయనివారకమంత్రము లుచ్చరించుచున్.
| 1307
|
పరశురామునకు బుషు లందఱుఁ బూజఁ జేయుట
ఉ. |
ఈతఁడు మున్ను తండ్రిపగ కెంతయు రోషకషాయితాక్షుఁడై
యాతతసత్కుఠారమున నారసి యిర్వదియొక్కమాఱు ధా
త్రీతలనాథులం దగ వధించి గతజ్వరమన్యుఁ డయ్యు నీ
రీతి నిదేలకో కనికరింపక గిన్క వహించె గ్రమ్మఱన్.
| 1308
|
తే. |
అనుచుఁ దలపోసి బహ్మర్షు లర్ఘ్యముఁ గొని, భీమదర్శను భార్గవరాముఁ జేరి
దేవ మత్పూజనంబుఁ బ్రతిగ్రహింపు, భార్గవ యటంచు మధురోక్తిఁ బల్కుటయును.
| 1309
|
క. |
మునిదత్తసపర్యను గై, కొని యట నిల్వక ప్రభూతకోపం బడరం
గనుల హుతాశనకణములు, చినుకఁగ రఘురాముఁ జేరెఁ జిడిముడి వడుచున్.
| 1310
|
వ. |
మఱియుఁ గైలాసంబుకరణి దుర్ధర్షుండును గాలాగ్నియుంబోలె దుస్పహుం
డును విద్యుద్గణసదృశుండును మహాపరశ్వథాలంకృతవిశాలస్కంధుండును శర
చాపధరుండును నై త్రిపురఘ్నుం డైనసాక్షాచ్ఛంభుండునుంబోలె దుర్నిరీక్షుం
డై పావకునిభంగి వెలుంగుచు రామునిమ్రోల నిలిచి యి ట్లనియె.
| 1311
|
పరశురాముఁడు రఘురామునితో ఘోరంబుగాఁ బల్కుట
చ. |
దశరథరామ నీవు బలదర్ప మెలర్ప విదేహువీటిలోఁ
బశుపతిఘోరకార్ముకము భగ్నము జేసినమేటి వంచు నే
విశదము గాఁగ నింత విని వేగమె చూడఁగ వచ్చినాఁడ న
న్బశుపతిశిష్యుఁ డైనయల భార్గవరామునిఁగా నెఱుంగుమా.
| 1312
|
చ. |
జనవరపుత్ర జీర్ణ మగు శంభునిచాపము ద్రుంచు టేఘనం
బనుపమలీల నాదువిశిఖాసనముం బరికింపు దీనిఁ గై
కొని వడి నెక్కు వెట్టి శరకోటి ఘటించితివేని రామ నీ
ఘనభుజశక్తిఁ జూచి వెనుకం దగ నిచ్చెద ద్వంద్వయుద్ధమున్.
| 1313
|
దశరథుఁడు పరశురాముని సవినయంబుగ ననునయించుట
చ. |
అన విని భీతుఁడై దశరథాధిపుఁ డంజలిఁ జేసి దైన్య మా
ననమునఁ దోప బల్కె మునినాథునితో ననఘాత్మ భూమిభృ
జ్జనములఁ ద్రుంచి త్రుంచి తుది శాంతుఁడవై కడు బ్రహ్మనిష్ఠచేఁ
బ్రణుతికి నెక్కి తీవు కృప బాలుని రామునిఁ బ్రోవగాఁ దగున్.
| 1314
|
ఉ. |
భూసురవర్య భార్గవుల పుణ్యకులంబునఁ బుట్టి భక్తితో
వాసవవహ్నిముఖ్యసురవర్యులు ప్రార్థన సేయ నస్త్రస
|
|