పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

గోన గన్నా రెడ్డి

ఈ దినాన తల్లిదండ్రులను వీడి, రాజకీయపు సుడిగుండాలలో పడిన ఒక అమాయికపు బాలికను, తనయందు ఉత్తమ గౌరవంతో ఏదోచేయాలని ఉన్న ఒక గుణశీలను ఆవిధంగా మనస్సు నొప్పించినా డేమిటి? ఏలాగు తాను ఆ బాలిక ననునయించుట? అప్పుడే అరవిచ్చు మందార పుష్పంలా ఉన్న ఈ శాంతశీలను మనస్సు నొప్పించగలిగిన తన చెయిదము క్షమింపరానిది. ఈ దినాన తనకు జరిగిన సంఘటన తనకు ఒక్క నిమేషమేని మరువరాని అప్రమత్తతను నేర్పుతున్నది. ఈనాటినుండి శత్రుల అడ్డగించుటలో తక్క ఇతర చేష్టలలో పరమశాంతత చూపించవలసి ఉన్నది.

గన్నారెడ్డి ఇతికర్తవ్యతామూఢుడైనాడు. ఏలాంటిమగవారితో నైనా తాను వ్యవహరించగలడు, కాని స్త్రీలవిషయం వస్తే తా నేమి చేయకలుగును? వారి జీవితాలకూ, తనకూ సంబంధం ఏమిటి? స్త్రీల హృదయం తన కేమి తెలియును? పురుషులకు కోపం వచ్చే విషయాలు వారికి నవ్వు కలిగించ వచ్చును. ఒక స్త్రీకి నవ్వు కలిగించే విషయం, వేరొక వనితకు క్రోధ కారణం కావచ్చును.

ఇంతకూ లలితాస్వరూపిణి ఆ బాలికను తన అక్కగారే సముదాయించునుగాక!

ఈ ఆలోచనతో గన్నారెడ్డి తన విడిదిలోనికి వెళ్ళిపోయినాడు.

• • •

అన్నాంబికాదేవి తన సౌధంలోనికి రూపెత్తిన ప్రసన్నతలా వెళ్ళగానే ఆమె చెలికత్తె అయిన మల్లిక పరుగునవచ్చి పాదాల నంటినది. అన్నాంబిక అతిసంతోషంతో మల్లికా! నువ్వటే? ఎప్పుడు వచ్చావూ? ఒసే ఎట్లావస్తివి? ఆదవోనినుంచేనా?, అని ప్రశ్నలవర్షం కురిపిస్తూ మల్లికను రెండు భుజాలూ పట్టి లేవతీసింది. కళ్ళ నీళ్ళతో నవ్వుతూ, మల్లిక రాజకుమారిని చూచి, ‘దొరసానమ్మగారూ! అమ్మయ్యా మీరేమయ్యారో తెలియక మహారాణీగారు, మేమూ పడిన బాధ ఇంతా అంతానండీ! మీరు కందనోలు వెళ్ళడం, అక్కడనుంచి ఆదవోని చేరడం మాకు వార్తలు వచ్చాయి. అప్పటికి మా మనస్సులు కుదుటపడ్డాయి’ అని తొందరగా, ఆనందంగా మాట్లాడింది.

అన్నాంబిక: నాకోసం అంత బాధపడ్డారటే?

మల్లిక: చిత్తం, దొరసానమ్మగారూ!

అన్నాంబిక: నాయనగారు ఏమన్నారు?

మల్లిక: నాయనగారు ప్రళయకాలరుద్రునిలా ఉన్నారు. ఆయన దగ్గరకు ఎవ్వరూ వెళ్ళలేకుండా ఉన్నారు. వారు బేడ చెలుకినాయనిం వారిని అన్నమాటలు విరోధులనుకూడ ఎవ్వరూ అనరు. ఆయన విజయ