పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

87

ఢక్కాను గన్నారెడ్డి దోచడం చాలా బాగా ఉందట. ఒక్క సైనికు నయినా పోగొట్టుకోకుండా తిరిగిరావడం ఆడవారి కొక్కరికే చెల్లుతుందట! మగవాడు ముసలాడై, ఆడదాని చేతులో రాజ్యం నడవడంవల్ల పరువుగల రేడులవంశాలన్నీ ఆడవాళ్ళ వంశాలయ్యాయట. ఒక్క మగవాడూ లేడట! అందుకనే పురుగులలాంటి, తేళ్ళలాంటి దొంగలూ, హీనులైన కొండజాతి వాళ్ళకన్నా నికృష్టులైన దారిదోపిడిగాళ్ళూ బయలుదేరారట. లోకం అంతా నిండిన ఈ కల్మషాలన్నీ నాశనంచేసి ధర్మరాజ్యం తాము స్థాపిస్తారట, చిన్న దొరసానమ్మగారూ! ప్రభువువారికి నిద్దట్లోనన్నా క్రోధం తగ్గుతుందో లేదో అనే నా అనుమానము.

అన్నాంబిక: నువ్వు ఎలావచ్చావే ఇక్కడికి?

మల్లిక: అదో వింతకథండీ, దొరసానమ్మగారూ! నాలుగు రోజుల క్రిందట తమ నగరిలో తోటలోనికి వెళ్ళానండీ, ఆ తోటలో తిరుగుతూ ఉంటే నాతోటున్న తక్కిన దాసీలు కొంచెం దూరమయ్యారండీ, తమరిని గురించే ఆలోచించుకుంటూ ఓ పొదరింటి దగ్గర కూలపడ్డానండీ అమ్మా. అంతలో ఎక్కడనుంచో ఆ సందె చీకట్లో ‘మల్లికా! నీకు అన్నాంబికాదేవంటే గాఢమయిన అపేక్షకదా?’ అని వినబడింది దొరసానమ్మగారూ! అడిలి, బేజారై, మాటరాక వణికిపోయానండీ తల్లీ! ‘భయపడకు! నీకు అన్నాంబికా రాకుమారంటే ప్రేమయేనా?’ అని మళ్ళీ వినబడింది. ఈపట్టు వెనక్కు తిరిగి చూచానండీ, ఆ పొదరింటిప్రక్క చీకట్లలోనుంచి ఒక పురుషుడు లేచి, కూర్చుండి ‘మల్లికా, నన్ను గన్నారెడ్డి ప్రభువులు పంపారు. మీ చిన్న రాణీ గారు ఆదవోని చేరి ఉంటారు. వారికి నువ్వు దగ్గర ఉండటం ఉత్తమంకదా! కాబట్టి నిన్ను ఆదవోని తీసుకువెళ్ళమని వారు నల్గురను మమ్ము ఆజ్ఞ ఇచ్చి పంపారు. ఇప్పటికి నాలుగు దినాలనుంచి మాలో ఒకరమైనా ఈ తోటలో కాపలా కాస్తున్నాము. నేటికి నీదర్శనమైంది. మే మా మహాపురుషునకు బంటులమై నాచిన్న చిన్న రాజ్యాలకు ప్రభువులము నేను రేచెర్ల సోమారెడ్డిని. నాతో వస్తే ఆదవోని తీసుకొని వెళ్తాను అన్నాడండీ. నాకు తమ మాట వినేవరకు ప్రాణం లేచివచ్చిందమ్మా! సరే వస్తానన్నానండీ!

అన్నాం: చాలా చిత్రంగానే ఉంది, ఆ వెంటనే వచ్చి వేసినావా మల్లికా?

మల్లి: వెంటనే ఎట్లాగండీ! ఊరు కాపలా పాండవుల శిబిరం, భేతాళుడు కాపాడినట్లేనండీ! అలా మహారాజులుంగారు కట్టు దిట్టాలుచేశారు.

అన్నాం: ఎందు కా కట్టుదిట్టాలు? నే నెలాగ వస్తిని.

మల్లి: ఏమో మీరు వెళ్ళినట్లు వట్టి గాలివార్తే! అందుకని ఆ సోమారెడ్డి ప్రభువు నన్ను వెంటనే చేయి దొరకపుచ్చుకొని హారీతిపులుగు సాయం