పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

85

గన్నా: (ఉలిక్కిపడి) ‘ఏమీలేదు అక్కా! మీరూ, బావగారూ, శ్రీ అన్నాంబికా రాకుమారిగారూ ఎప్పుడు ఓరుగల్లుపురం ప్రయాణమై వెళ్ళేది?, అని ఆలోచిస్తుంటిని.

కుప్పాం: రేపు పూర్ణిమ వెళ్ళిన తదియకదా?

గన్నా: మీరు వెళ్ళగానే, ఈ గజదొంగ విషయమై శ్రీ రుద్రదేవ ప్రభువులు, శ్రీ శివదేవయ్య మంత్రుల్ని అనేక విధాలుగా ఒత్తిడి చేయవచ్చును.

అన్నాం: ప్రభూ! మీరు మాతోరండి, నేను వెళ్ళి మహారాజయిన రుద్రదేవ ప్రభువుల పాదాల వాలి తమ్ము క్షమింపుమని వేడుకొంటాను.

గన్నారెడ్డి తనలో ‘మళ్ళీ ఈమె ఏదో మొదలు పెట్టింది బాబూ’ అనుకుంటూ, పైకి ‘రాజకుమారీ! నా పరాకృతఫలం నేను అనుభవింపక తప్పదు గదా! ఎవ రేమి ప్రయత్నం చేసినా లాభంలేదు! పైగా ఆ రుద్రప్రభువు నా రాజ్యం మా పినతండ్రి అనుభవిస్తూంటే, ఒక్క పిసరంతైనా అది అధర్మమని శ్రీ లకుమయారెడ్డి ప్రభువులకు వార్త పంపినారుకారు. అలాంటి వారి గొడవ నా కక్కరలేదు. నా గొడవ వారి కక్కరలేదు! నాకొరకు మీరు ఆయాసం చెందకండి.’

అన్నాంబిక ఆ మాటలు విని ఎంతో చిన్నబుచ్చుకొన్నది. అయినా ఈ వీరుని కోపం తనమీద కాదు, రుద్రదేవుల ప్రభువుల మీద అయినట్లు స్పష్టమేకదా, తనంటే ఈషణ్మాత్రం గౌరవం కలిగినా, గన్నారెడ్డి ఆ ముక్కలనేవారు కాదు.

అన్నాంబిక కించపడుట గన్నారెడ్డి కనిపెట్టి ‘రాజకుమారీ! అలా అన్నానని మీరు ఆశ్చర్యం పొందకండి! నేను మొరకుణ్ణి; మీరు సదుద్దేశంతో, దయతో అన్నమాటలు మీ ఉత్తమహృదయాన్ని తెలుపుతాయి. అందుకు నేనూ, మా తమ్ముడూ తమకు కృతజ్ఞులం. నవనీత హృదయంగల మిమ్ములను మాపై క్రోధం వహించి ఉన్న రుద్రదేవ ప్రభువులు ఏమంటారో అని భయం. ఇది మీరు అన్యధా తలచకండి’ అని వేడికొను మాటలు కాకువుతో అన్నాడు. ఆ మాటలకు అన్నాంబిక కలతతేరి, ‘ప్రభూ, నేను సెలవు తీసుకొంటాను’ అని హర్మ్యంలోకి మందాక్రాతవవృత్తములా నడిచి వెళ్ళిపోయింది.

గన్నారెడ్డి తన కర్కశత్వానికి తానే తెల్లబోయి, మ్రాన్పడి అట్లే కూరుచుండిపోయినాడు.

కుప్పాంబిక తమ్ముని చుఱచుఱ చూచి ‘తమ్ముడూ! మీరు అన్నాంబికా రాజకుమారి మనస్సు అలా నొప్పించినా రేమిటి?’ ప్రత్యుత్తరము కోరని ప్రశ్నవేసి, కుందిన హృదయంతో లోనికి వెడలిపోయింది.

గన్నారెడ్డి అట్లే నిలుచుండిపోయినాడు. తనలో ఏదో విపరీతస్థితి సంభవించి ఉండడంచేత ఎవరన్నమాటలకూ ఎప్పుడూ విసుగుచెందని తాను