పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

81

అన్నాంబిక హృదయం ఒకగంతువేసింది. ఆమెకు గన్నారెడ్డి వచ్చారనే వార్తతో పాటు ఒక మహానిస్సాణ ధ్వని బుద్ధపురమంతా మారుమ్రోగింది. ఆ గంభీరధ్వని వినడంతోనే అన్నాంబిక తన మేనమామ అయిన బేడ చెలుకినాయనింవారి నిస్సాణాన్ని గన్నారెడ్డి విజయప్రాభృతంగా కొనివచ్చినారని అర్థం చేసికొన్నది. ఆమెలో ఏదో సంతోషం, ఏదోభయం ఆవరించుకున్నవి. ఎవ రీ గన్నారెడ్డి? ఈ గజదొంగ అంటే తన కింత కుతూహలం ఎందుకు? ఈయన మహాపురుషుడా? హీనుడా? తాను ఇట్లా తల్లిదండ్రులను వదలి ఇంత విచిత్రంగా ఈ బుద్ధపురం రావటం ఏమిటి?

అన్నాంబిక ఆమెకై ఏర్పాటుచేసిన శుద్దాంతనగరిలో ఉపథానాల పల్యంక పీఠముపై అధివసించి వేయి ఆలోచనల పాలయింది. ఎంత ఆలోచించినా హాస సుందరమైన గన్నారెడ్డి మోము ఆమె హృదయాన్ని చిందరవందర చేస్తున్నది. తా నా పురుషుని ప్రేమిస్తున్నానని ఆమె నిశ్చయానికి వచ్చింది. ఆ నిశ్చయం ఆ బాలకు కలగడంతోటే ఆమె గజగజ వణకిపోయింది. యుద్ధవిక్రమంలో, సౌందర్యంలో అర్జునుడై ఈ మహాభాగుడు గజదొంగ అని కళంకం సంపాదించుకొన్నా డేమిటి? తన్ను పెండ్లి కూతురునిచేసి చిన్న బంగారురథముమీద అధివసింపచేసి, బంగారుపువ్వుల పట్టుతెరలు కప్పి వివాహమందిరానికి తన్ను తీసుకువస్తూ ఉండగా తెర ఒత్తిగించి ఈవిచిత్రకథానాయకుని తాను చూచినప్పటినుంచి తన మనస్సు ఆయనపై లగ్నమైయుండి ఉండాలి. అది పవిత్ర ముహూర్తమో, దుర్ముహూర్తమో?


8

తా నీ మహాపురుషుని, ఈ గజదొంగను, ఈ పరమోత్తమ వీరుని ప్రేమిస్తున్నమాట నిజం! ఈ ఉత్కృష్టమూర్తి ఈవిధంగా తన జీవితాకాశం ఆక్రమించిన వెలుగుమూర్తి అయినాడేమి! అదేనాప్రేమ? ఈప్రేమనేనా శకుంతల దుష్యంత దర్శనముచే అనుభవించినది! తన్ను ఆ మహాపురుషుడు ప్రేమించగలడా? ఈ వీరాధివీరుడు, ఈఉత్తమ దుర్జయాన్వయుడు తన్ను ప్రేమించకపోయిన క్షణం తనజన్మతీరినట్లే! లోకమే తలక్రిందు లగునుగాక, సర్వభువనాలూ మండిపోవునుగాక, తా నీ వీరుని చెట్టపట్టకుండ నెవరు వారింపగలరు?

“ఈ వీరుడు గజదొంగ అగునుగాక. తానును గజదొంగ అవుతుంది! ఆయన రాజ్యాలు నగరాలూ దోచనీ, తానును అలాగే చేయగలదు. ఆయన ప్రేమకై తపస్సుచేసి, ఆయన చూపులకై తేజస్సుల వెలిగించి, ఆయన ప్రేమ భాషణలకై సర్వశ్రుతులూ స్పందింపజేసి, ముల్లోకాలనూ గగ్గోలుపరగలదు తాను” అని ఆమె ప్రతిజ్ఞ గై కొంది.