పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

గోన గన్నా రెడ్డి

మహాప్రభువులకు ఎదురుతిరిగినాడో ఆమెకు ఏమీ తెలియదు. కాని అందులోని రహస్యం ఏదో తన భర్తగారగు శ్రీ గుండయమహారాజుకు తెలియును. ఆయన కుప్పాంబికను చూచి “దేవీ, మా బావమరదులు గన్నారెడ్డీ, విఠలధరణీశుడూ ఏవో కొన్ని మహత్తర కారణాలుండి గజదొంగలయ్యారు. కాని నేను విన్నంతవరకు వాళ్ళు దారులు ఎక్కడా దోచినట్లెరుగను, ఇక ముందును దోచబోరు. ఉత్తరోత్తరా మీకు కొన్ని రహస్యాలు చెప్తాను. గన్నారెడ్డి యుద్ధవీరులలో మేటిరత్నం. నీ పినతండ్రిగారు లకుమయారెడ్డి భూపాలుడు మీ తమ్ముళ్ళ నిద్దరిని అన్యాయం చేయ సంకల్పించుకొన్నారు. అ సందర్భములో వీరుడైన గన్నారెడ్డి ఎట్లు ఊరకొనగలడు” అని చెప్పినారు.

భర్త చెప్పిన ఈ ముక్కలు విని కుప్పాంబికాదేవి హృదయం పొంగి పోయింది. ఆ రాత్రి అన్నాంబికాదేవి పురుషవేషంతో తన దగ్గరకు అలా రాగానే ఆమెను కౌగలించుకొని “తల్లీ, అన్నాంబికా రాజకుమారీ! రాజకీయాలు ఎప్పుడూ యిలా కర్కశంగా ఉంటాయి. మీరు మీ తండ్రిని, తల్లిని వదలి ఈలా రావలసిన అత్యవసరాన్ని గూర్చి మా తమ్ముడు గన్నారెడ్డి ప్రభువు నా కన్నీ చెప్పినాడు. ఈ సంఘటనవల్ల ఈ కుటుంబాలన్నిటికీ ఏయే కష్టాలు వస్తాయో అవి అన్నీ మనం భరించవలసి ఉండెను” అని చెప్పింది.

అన్నాంబికాదేవి: కుప్పసానమ్మదేవీ! మీ భర్త గుండయ మహారాజుల వారు వితరణంలో కర్ణుని, శిబిని చిన్నబుచ్చుతున్నారు. వారికి తగిన దేవేరులు మీరు. మీ ఇద్దరి దాంపత్యము అనన్యము. అలాంటి మీకు తమ్ములైన గోన గన్నారెడ్డి ప్రభువు గజదొంగలంటే నేను నమ్మను. నాకు వరదారెడ్డి రాకుమారుని వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేదు. అందుకని ఈ వివాహం తప్పించాలని ప్రయత్నంచేసే మీ తమ్ముల సహాయం నేను అంగీకరించాను.

కుప్పసానమ్మ: సంతోషం తల్లీ, మనం వెంటనే బయలుదేరాలి.

ఇంతలో గోన గన్నారెడ్డి ప్రత్యక్షమై వారిని ప్రయాణం చేశాడు. ఆ రాత్రి రాత్రి వారు కందనోలు చేరుకున్నారు. కందనోలులో రెండు దినాలు ఆగి కృష్ణా తుంగభద్రా సంగమమైన సంగమేశ్వరమునకు పోయి ఆ పుణ్యతీర్థంలో క్రుంకులిడి సంగమేశ్వరుని అర్చించి బ్రాహ్మణులకు విరివిగా దానా లిచ్చి రెండు దినాలల్లో బుద్ధపురంవచ్చి చేరిరి.

బుద్ధపురంలో అన్నాంబికాదేవి, గన్నారెడ్డికీ బేడ చెలుకినాయనికీ జరిగిన యుద్ధ పర్యవసానం ఏమైందో అని ఆతురతతో కనిపెట్టుకొని యుండెను. కుప్పాంబికా మహారాణిని ‘వార్తలేవైనావచ్చినవా’ అని అడుగుచుండెను.

వీరు బుద్థపురంవచ్చిన మూడవదినానికి గన్నారెడ్డి, విఠ్ఠలధరణీశులు మహారాణి అంతఃపురానికి వచ్చారని వార్తవచ్చింది. ఆ వార్త వినడంతోనే