పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

గోన గన్నా రెడ్డి

ఆ ఆలోచనతో ఆమె ఉప్పొంగిపోయింది. వేయి మనోహరరాగాలు ఏక రూపొంది, అమృతప్రవాహమై ఆమెను చుట్టివేసినవి. ఆమె పులకరించిపోయినది. ఆమె జీవితంలో ప్రతిఅణువు గన్నభూపతిపై ప్రణయముచే దివ్యత్వము పొందింది.

ఇంతలో కుప్పాంబికాదేవికడనుండి అన్నాంబికను దర్శించుటకు అనుమతిని కోరు పిలుపు వచ్చింది. అన్నాంబిక పీఠమునుండి లేచి తాను మహారాణిరాకకై గౌరవంతో ఎదురుచూస్తున్నదని ప్రతివార్త పంపినది. కొంతసేపటికి కుప్పాంబిక అన్నాంబికకడకు వచ్చినది.

అన్నాంబిక తొందరగా ముందుకు నడచివచ్చి ‘మహారాణీ! మీరు నన్ను అనుమతి వేడడం సమంజసముగా లేదు. మనము దగ్గరచుట్టాలము. నేను మీకన్న చిన్నదానను’ అని కన్నుల నీరు తిరుగ మనవిచేసింది.

కుప్పాంబిక అన్నాంబిక చేతులుపట్టి దాపుననున్న ఆసనముపై ప్రక్కన కూర్చుండబెట్టుకొని ‘రాజకుమారీ! మీరు ఆదవోని ప్రభువుల కుమారికలు. మీకు ప్రధానోత్సవం చేయబోయేముందు మాతమ్ముడు మిమ్ము ప్రోత్సహించి తల్లి దండ్రులను వదలి పారిపోయి వచ్చునట్లు చేసినాడు. మీరు మా అతిథులు. తల్లిదండ్రులను విడిచి వచ్చినందుకు మీమనస్సు ఏదైనా కించపడుతోందేమోనని మాతమ్ముడు కనుక్కొమ్మన్నాడు’ అని అనునయపు మాటలు పలికినది.

అన్నాంబిక: మహారాణీ! నేను గన్నారెడ్డి ప్రభువులతో ఏమీ అనుమానం లేకుండా వరదారెడ్డి రాకుమారుని వివాహం చేసుకోడానికి ఇష్టంలేదని స్పష్టంగా మనవిచేసి ఉన్నాను. ఆదవోనినుంచి నేను పారిపోయివచ్చే వీలు ఆ ప్రభువు కల్పించకపోయినట్లయితే నా వజ్రపుటుంగరములోని విషము త్రాగిఉందును.

కుప్పాం: అన్నాంబికాదేవీ! మీరు మీ తలిదండ్రులను విడచి ఏదో పర్యవసానం తేలేవరకూ నాదగ్గిర ఉండగలరా?

అన్నాం: మహారాణీ! మా నాయనగారు నేను ఇక్కడ ఉన్నాను అని తెలియగానే కోపగించి, తనసైన్యాలు, తనస్నేహితుల సైన్యాలతో వచ్చి మీ కోట ముట్టడించవచ్చును. మీ సైన్యాలతో అనేకమంది వీరులు మడియవచ్చును. ఇందుకు నాకు ఒకే ఉపాయం తోస్తూఉన్నది. నన్ను ఓరుగల్లు పంపించండి. అక్కడ శ్రీ రుద్రదేవి మహాప్రభువుగారి అంతఃపురంలో ఉంటాను.

కుప్పాం: ఎంత ఆలోచనమ్మా మీది! మీరన్నట్లే మా తమ్ముడున్ను చెప్పినారు. మీ తండ్రిగారవడంవల్ల ఆదవోని ప్రభువును ఏమి చేయడానికీ తనకు ఇష్టంలేదట!

అన్నాం: వారికి కృతజ్ఞురాలను.