పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

79

మార్తాండుండును, పెదముద్దుగండమిండుడును, బాచ మహారాణీ బాచమహా రాజపుత్రుండునూ, మల్యాలవంశ కలశాంభోధిచంద్రుడును, వారనారీయౌవనవన వసంతుండును, దుష్టతురగరేఖారేవంతుడును, అసిముసలకార్ముక ప్రముఖ నిఖిలాయుధ కుశలుండును, కీర్తివిశాలుండును, రాజసమాజ జేగీయమాన నిజభుజ విజయుండును, విక్రమ విజిత విజయుండును, శ్రీ కుప్పాంబా మానససరోవర విహరమాణ రాజహంసుడును, శ్రీ విశ్వనాథదేవ దివ్యశ్రీ పాదపద్మారాధకుండును, రిపుకులభేదకుండును అయిన శ్రీ శ్రీ మాల్యాల గుండయ దండాధీశ్వరుడు రాజ్యంచేస్తూ ఉండెను.

ఆ మహారాజు దేవేరి వర్ధమానపురాధీశ్వరుడైన గోన బుద్ధారెడ్డి మహారాజు కొమరిత, గజదొంగ గోన గన్నారెడ్డి అక్కగారు, గన్నారెడ్డి బేడ చెలుకినాయని నిస్సాణాపహర్తయైన ముహూర్తానికి వారం దినాలకు, ఆదవోని ప్రభు తనయను అన్నాంబికాదేవిని సగౌరవంగా తోడుకొని బుద్ధపురం చేరినదాయెను.

కుప్పాంబికాదేవి ముప్పదియారేండ్లది. కుప్పాంబికాదేవికి ముగ్గురు సంతానం. పెద్దవాడు బాచయ్య. బాచయ్యప్రభువు పన్నెండేండ్లవాడు. రెండవకుమారుడు చొప్పప్రభువు ఎనిమిదేండ్లవాడు. మూడవవాడు గణపతిదేవ ప్రభువు నాలుగేళ్ళబిడ్డడు. కుప్పాంబికాదేవి తమ్ముడైన గోన గన్నారెడ్డి ప్రోత్సాహంవల్ల భర్త అనుమతితో అన్నాంబికాదేవిని తనతో తీసుకొని రావడానికి కొంతసైన్యముతో బయలుదేరి కృష్ణానదీ తుంగభద్రానదీ రెండూ దాటి ఆదవోని వఱకు వెళ్ళినది. ముగ్గురుబిడ్డలు బుద్ధపురంలోనే ఉండిపోయిరి. ఆ రాత్రి ఆ మహారాణి ఆదవోనిదగ్గర అరుంధతిపాలెంలో విడిదిచేసి ఉన్నప్పుడు అన్నాంబికా రాకుమారి పురుషవేషంధరించి గోన గన్నారెడ్డి సైన్యానికి చెందిన ఒక దళం వెంబడి తనదగ్గరకు వచ్చేటప్పటికి అతిసంతోషముతో ఆ బాలికను తన హృదయానికి అదుముకొన్నది.

కుప్పాంబిక కాయశరీరంగల బంగారు శలాకలాంటి మనోహరాంగి. ముగ్గురు బిడ్డల తల్లియైనా సడలిపోని జవ్వనపు బిగువు కలది. కుప్పాంబికా దేవికి భర్త అంటే భగవంతుడే, బుద్ధారెడ్డి గారాబుకూతురై గోనవంశ దుగ్ధాంభోధిలో మందారవృక్షంలా ఉద్భవించి మల్యాలనందనవనాన్ని తేజరిల్ల చేస్తూ చొచ్చింది.

కుప్పాంబికాదేవి తమ్ముళ్ళ నిద్దరినీ అత్యంతప్రేమతో తల్లి అనంతరం పెంచింది. తండ్రిపోలికలు మూడుమూర్తులా పుణికపుచ్చుకున్న పెద్దతమ్ముణ్ణి, మేనమామ అయిన శ్రీ విరియాల భీమనృపతిలా, అపర భీమునిలా ఉన్న విఠల ధరణీశుని అచంచలమైన ప్రేమతో పెంచింది.

గన్నారెడ్డి తెలివి, బుద్ధి, చదువు అనుమకొండ మహావిద్యాక్షేత్రంలో ప్రసిద్ధిపొందినాయి. అలాంటి గన్నారెడ్డి ఎందుకు శ్రీ గణపతిదేవ రుద్రదేవ