పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

57

మధు మాంసాదులు వర్ణించితీరవలయును. కాకతీయప్రభువులు రుద్రదేవ చక్రవర్తి కాలంనుంచి మధుమాంసాదులను మానివేసిరి.

రుద్రదేవమహారాజు భోజన మారగించి, లేవగా పరిచారకలు బంగారు చెంబులతో నీరు కొనివచ్చి చేతులుకడిగి తుడిచినారు.

ప్రభువు తాంబూలమందిరములోనికి పోయి, ఒకపల్యంకపీఠంపై అధివసించగనే మహారాణి శ్రీ ముమ్మడాంబికాదేవి రా ననుమతి వేడినారని వార్త వచ్చినది.

రుద్రదేవ ప్రభువు లేచి చిరునవ్వుతో సంతోషంతో తన నగరులో నుండి ముమ్మడాంబికాదేవి నగరునకు పోవు మందిరాలవైపు నడుస్తూ ఎదురేగినవా రయిరి.

ఇంతలో క్రొక్కారు మెరుంగుతీవలా, ఆకాశాన్నుంచి దిగివచ్చే రతీదేవిలా మహేశ్వరునికై హైమవతి హృదయంలోంచి బయలువెడలిన దివ్యకాంక్షలా, ముమ్మడాంబిక లత్తుక అలంకరించిన పాదాల బంగారు గజ్జియలు, మంజీరాలు గల గలలాడ ఒయ్యారంగా, నడుస్తూ భర్త కెదురువచ్చినది. రుద్రప్రభువు చేతులు చాచి ముమ్మడాంబికచేతులు ప్రేమతో పట్టి “మహారాణీ! నామందిరానికి దయ చేయండి. మీకు పరమరహస్యం మనవిచేస్తాను. రండి, నా పూజామందిరానకు” అని అనునయించినారు.

మహారాజును, మహారాణియు కలిసి మహారాజు పూజామందిరానకు పోయినారు.

రుద్ర: దేవీ నా జీవితానికి అవసరమైతే మీరు తగిన సహాయం చేయగలరా?

ముమ్మ: ప్రభూ! మీరు నా దైవము; మీరే నా ప్రభువులు, మీరే నా జీవితము. నా సర్వస్వము మీకై అర్పించివేయడానికి నే నెప్పుడూ సిద్ధమే.

రుద్ర: దేవీ! అదిగో పూజామందిరం. అందులో పరమశివుడూ, విశాలాక్షీ, గణపతి, కుమారస్వామి మున్నగు దేవతలు అహూతులై ఉన్నారు. వారందరి సాక్షిగా నేను మనవిచేసే విషయాలు అత్యంత నిగూఢాలు. ఒకటి: మనరాజ్యం కోసము మా నాయనగారు చేయగూడని పని ఒకటిచేశారు. అది నేను భక్తితో తల దాల్చాను.

ముమ్మ : మహారాజా! తము ఆలోచించకుండా చేసినదే ఉత్తమము. ఇక ఆలోచించి చేసినపని ఉత్తమోత్తమమేగదా!

రుద్ర : వారే నాచేత ఆ వ్రతము పట్టించారు.

ముమ్మ : మహాప్రభూ! అది మహా ప్రసాదం.

రుద్రదేవ ప్రభువు పూజామండపంకడ మోకరించి పది విఘడియలు ప్రార్థించారు. అంత వారు లేచినవారై మహారాణిని తనదగ్గర కూర్చుండ ప్రార్థించారు.