పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

గోన గన్నా రెడ్డి

“ఈ రహస్యం మీరు ధైర్యంతో భరించాలి. పురుషులకు నాకున్న కుంతల సౌభాగ్యం ఎన్నడైనా చూశారా దేవీ?”

“లేదు. ఆ సౌభాగ్యం చూచిన నాకు అత్యంతాశ్చర్యం జనించింది.”

“నా ఈడులో నూనూగుమీసాలైనా రాని పురుషు లుంటారా దేవీ?”

“చిత్తం. ఆ విషయమూ నా కెప్పుడూ ఆశ్చర్యం కలగజేస్తూనే ఉంటుంది ప్రభూ!”

“శ్రీ గణపతి రుద్రదేవ చక్రవర్తికి పురుషసంతానము లేదు.”

“ఆఁ! ఏమి తాము వచించేది! నా కేదో దడవస్తున్నది? తాము ...? తా ...?”

“శ్రీగణపతి రుద్రదేవసార్వభౌములకు ఇద్దరు కొమార్తెలు.”

“ఇద్దరా? గణపాంబాదేవిగారు ఒక్కరేకాదా?”

“నేను చక్రవర్తి పెద్దకొమార్తెను నా పేరు రుద్రదేవి.”

ఈ విషయాలు రుద్రదేవి చెప్పడం ప్రారంభించినప్పటినుంచిన్నీ గజగజ వణకుచున్న ముమ్మడాంబిక కంట జలజల బాష్పవారి ప్రవహించి పోయినది. ఆమె పట్టలేక రుద్రదేవి ఒడిలో వాలి వెక్కివెక్కి ఏడ్చినది. ఆ క్షణం ఒక దివ్యసుందరవిగ్రహుడు శాపంచేత స్త్రీగా మారిపోతున్నట్లు ఆమె భావించుకొని మరియు దుఃఖించినది. తాను తన ఆత్మేశ్వరుని గాఢంగా కౌగలించుకుంటే ఆయన పురుషత్వము నశించిపోదని రుద్రదేవిని ఆ బాలిక ఇంకా గాఢంగా హృదయాని కుదుముకున్నది.

తనతెలివిలేమిచే తన పురుషుడు పురుషత్వం కోలుపోతున్నాడని ఆమె భావించుకొని గజగజ వణికిపోయినది. తనభర్త కేదో మహదాపద సంభవించినదని ఆమె శరఘాతచెందిన కపోతరాజును చూచిన కపోతిలా మూర్ఛపోయింది.

రుద్రదేవ ప్రభువు ‘ఎవరక్కడ?’ అని కేక వేసినారు పలువురు పరిచారికలు పరువిడి వచ్చి ముమ్మడమ్మకు శీతలోపచారాలు చేయగానే, ఆమె తెలివి నందింది.

“మహారాణీ! ఉపశమించండి. మీరంత బాధపడుదురని ఎరిగి ఉండిన్నీ నేను తొందరపడి చెప్పివేసినాను.”

“మహాప్రభూ! మీరు చెప్పేవిషయాలు నా కేమీ అర్థంకాలేదు.”

“నేను మీబోటి బాలికను. మా నాయనగారు పుత్రుని వాంఛించి, వాంఛించి, స్వయంభూదేవుని పూజించి, పూజించి నన్ను గన్నారు. ఎన్నాళ్ళో పిల్లలులేని వారికి నేను కలగడమే బ్రహ్మానందమైనది. కాని పుత్రికననే విచారము వారిని వెన్నంటింది. అప్పుడే విశ్వేశ్వర శివదేశికులు, ‘భగవంతుని విలాసాలు అర్థంచేసికొని పురుషుడు ఆనందించాలి. పరమశివుని కృపవల్ల కాకతీయసామ్రాజ్య విచ్ఛిన్నానికి శుంభనిశుంభాది రాక్షసు లెవరో ఉద్భవించి