పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

గోన గన్నా రెడ్డి

“కాని గన్నయ్య మెరుపునుమించిన వేగంతో వెనక్కు ఉరికి ఆ వ్రేటు తప్పించుకొన్నాడు. అక్కడనుండి పకపక నవ్వుతూ, ఉప్పల సోముని అపహాస్యంచేస్తూ, గోన గన్నయ్య చేసిన యుద్ధం దేవతలుచూసి ఆనందించినారట,”

రుద్ర : గన్నయ్య కత్తియుద్ధంలో అంత మొనగాడా!

గొంక : దివ్యచిత్తం మహారాజా! ఆనాడు ఉప్పల సోమప్రభువు చూపిన కత్తియుద్ధ విచిత్రాలు ఇదివర కెన్నడూ ఎవ్వరూ చూపలేదట! గన్నయ్య “ఓయి ఉప్పల సోమా! తిన్నఇంటికి వాసాలు లెక్కపెట్టవూ, వాసా లెన్ని? నువ్వా రుద్రప్రభువును సింహాసనంమీదనుంచి లాగిపారవేసే అపరరావణాసురుడవు? ఓహో కొత్తచక్రవర్తీ! జాయపమహారాజభృత్యా! ఉప్పుచేపలుతినే అఖండవీరా! ఏదిరా నీ కరవాల విక్రమము? ఆడదాని చేతికూడు తినవేమి? ఆదోనివారూ, మా పినతండ్రిగారూ మంచి హంతకుణ్ని చేరదీశారు. ఆ హంతకుడు ఉప్పుతిని ముప్పందుం అవుతాడట!” ఈలాటి మాటలంటూ ప్రళయనాట్యమే చేశాడట. అంతటి వీరుడూ, ఉప్పల సోమన్న చెమటలు కారిపోవగా యుద్ధం చేస్తూన్నాడట, గరుడప్లుతంతో పైకెగిరి, గోనవారిబాలుడు కత్తి పై కెత్తేసరికి వంగి గన్నయ్యపొట్టలో పొడవ బోగా గన్నయ్య పకపక నవ్వి పర్వతచక్రమణంచేసి కాలిజోడుతో ఆ కత్తిని పక్కకుతన్ని, వెంటనే కుడ్యబంధన విధానాన కత్తిని మూడు నిలువు కోతలులాగి క్రిందికికొట్టి కత్తితో చక్రధారికా ప్రయోగం చేసి ఉప్పల సోముని తల ఆకాశమునకు ఎగురగొట్టాడట!

రుద్ర: హర! హరా! ఏమి దారుణము! ఎంతటి వీరునికి ఎంతగతి పట్టింది. గొంకప్రభూ! గన్నయ్య గజదొంగయై, ఈలా పాడయిపోయినా డేమి?

గొంక : మహా ప్రభువులకు తెలియని రహస్యాలున్నాయా?

రుద్ర: మీ రా దొంగవిషయం జాగ్రత్తగా కనుక్కోండి. ఇది మా ఆజ్ఞ.

విర్యాల గొంకరాజు యువమహారాజుకడ సెలవుతీసికొని వెళ్ళిపోయాడు.

మహారాజు వెంటనే లేచి దౌవారికలు ఆవునేతి కాగడాలతో దారిచూప అభ్యంతర మందిరాలలోని పూజాగృహానకు పోయి, పురోహితుడు ప్రసాద మందీయ కన్నుల కద్దుకొని సేవించి, మహాననగృహాలలో భోజన మందిరానకు పోయినారు.

అక్కడ మణులు పొదిగిన దంతపుపీఠంపై మహారాజు అధివసించారు. ఎదుట బంగారపు అరటిఆకు పెద్ద అరటిఆకులో ఉంచబడినది. ఆ బంగారపు ఆకుచుట్టూ, బంగారపు గిన్నెలలో కూరలు, పులుసులూ, పచ్చళ్ళు ఉంచబడినవి. వీర శైవులు మాంసాదులు తినరు. లింగము కట్టుకున్న మనుష్యుడు