పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

55

గొంక : దారిలో విఠలధరణీశుడు, సూరనరెడ్డి కొద్దిసైన్యంతో ఉప్పల సోమునికి ఎదురుపడ్డారట. పాపం ఉప్పల సోమప్రభువుతో వేయిమంది సైనికులే ఉన్నారట! ఆ గజదొంగలతో నాలుగువేలమంది రాక్షసు లున్నారట.

రుద్ర : గజదొంగలబలం ఎప్పుడూ అంతేకదా, గొంకప్రభూ!

గొంక : చిత్తం! చిత్తం సోమరాజు, “ఇదా మగతనం మా బలగం తక్కువ అని చూచి ఈలా చేయడానికి వచ్చారు వికృష్టులు” అని అరచాడట !

రుద్ర : ఆఁ!

గొంక : ఆ వెంట ఎక్కడినుంచి ఉరికాడో గన్నారెడ్డి నవ్వుకుంటూ కత్తి ఝుళిపిస్తూ వచ్చాడట.

రుద్రప్రభువు ముందుకువంగి “ఆ తర్వాత ఏమయిందీ?” అని అడిగినారు.

10

గొంకరాజు ప్రభువునుద్దేశించి ఉప్పల సోమప్రభుని గాథను ఇల్లా మనవిచేసినవాడాయెను.

“మహాప్రభూ! సేవకుడును. అప్పుడు గన్నారెడ్డి ఉప్పల సోమరాజును చూచి, “ఓయీ! మగవాడా! ఓయీ మహా కఠినప్రతిజ్ఞ పట్టినవాడా! నువ్వు నా తల రాజలోకం పాదాలముందర చెండులా పడవేస్తా నన్నావట. ఇదిగో నేను, ఇది నా తల. నీ సైన్యం నా సైన్యం యుద్ధానికి దిగ నవసరం లేదు. నీ సైన్యం యావత్తూ ఇదివరకే నా పక్షం తిరిగిపోయింది. ఇక నువ్వూ నేనే ద్వంద్వయుద్ధం చేద్దాము. నువ్వు ఖడ్గయుద్ధంలో ఆరితేరిన మగటిమి కలవాడనని ఛప్పన్నదేశాలూ పేరుపొందావు. నేను గజదొంగను. నువ్వు నా తల కొట్టినావా ఎవ్వరుగాని నీ జోలికిరారు. నీ దేశంలో దిగబెడ్తారు. ఎంత చెడిపోయినా నేను శ్రీ బుద్ధారెడ్డిప్రభువు కుమారుణ్ణి. అతడు నా తమ్ముడు విఠలప్రభువు. అతడు నా మాట పాలన అవునట్లు చూడగలవాడు అని చెప్పి పకపక నవ్వాడట.

“మహాప్రభువులు ఉప్పల సోముని ఖడ్గయుద్ధ నిపుణత్వం ఎరుగుదురు గదా! ఖడ్గ, కరవాల, భిండివాల, ఛురికా యుద్ధాలలో లోకప్రఖ్యాతి పొందిన ఉప్పల సోముడు గోన గన్నయ్యలా ఆరడుగులపైన పొడుగువాడు. విశాలమైన వక్షం కలవాడు దీర్ఘబాహువులవాడు, మొక్కవోని పరాక్రమం కలవాడు. భీకరమైన తేనెకన్నులు కలవాడు. కండలు పట్టిన దేహం కలవాడు, గోన గన్నారెడ్డి మాటలు పూర్తికాకుండా మెరుపువేగంతో కత్తితీయడం, పిడుగు వేగంతో గన్నయ్యమీదికి ఉరికి కత్తినెత్తి అతని శిరస్సుపై అఖండ శక్తితో వేశాడు. ఆ వ్రేటుతో గన్నయ్య ఖండితమస్తకుడై పడిపోవలసిందే.