పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

గోన గన్నా రెడ్డి

అశ్వాల్ని, హస్తిపకుల్ని, గజాల్ని, కాల్బలాన్ని ముక్కలుగా చెండాడడంప్రారంభించింది. తల యెత్తితే తీవ్రబాణాలు నిలువునా కూలుస్తున్నవి. ఆ గడబిడలో, ఆ చిందరవందరలో ఎవరికీ ఏమీ తెలియటం లేదు. విరుచుకుపడే విధిలా బాణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం కొంటున్నవి. గుర్రాలు, ఏనుగులు తిరుగబడ్డాయి. ఉక్కిరిబిక్కిరి, కసకస తొక్కిసలాట. బాణాలు! బాణాలు!

“కోనగిమైలి ప్రభుని రథంమీద కురిసిన బాణాలవర్షం కరిగి నీరైంది. ఏభై గాయాలతో మైలపనాయకుడు పెళ్ళుమని విరుచుకుపడి విలవిల తన్నుకుంటూ చచ్చిపోయినాడు.”

“గోన గన్నారెడ్డిని పట్టుకునేందుకు వచ్చిన సైన్యంలో మూడవవంతుకూడా వెనక్కు పారిపోలేకపోయారు. గన్నారెడ్డి అడవుల్లో ఎక్కడనుంచో పకపక నవ్వు తున్నాట్ట.”

రుద్రప్రభువు ఆశ్చర్యంపొంది “ఏమిటి! గన్నారెడ్డి ఎంతటి దారుణానికి ఒడిగట్టినాడు. అతని దౌర్జన్యం అణచగల మేటి మన రాజ్యాలలో ఎవ్వరూ లేరా?” అని గొంకప్రభువును ప్రశ్నించారు.

గొంక : మహాప్రభూ! ఒకరేమిటి? వేవురు ఉండిరాయను. వారందరూ ఆ గజదొంగపైకి దూకితీరుతారు.

రుద్ర : వారంరోజులక్రిందట కృష్ణవేణి ముఖగ్రామాలనుండి శ్రీ జాయప మహారాజులంవారితో సేనానాయకుడుగా వచ్చి సార్వభౌములవల్ల శ్రీశైలప్రాంత మార్కాపుర ప్రభువైన ఉప్పల సోమప్రభువు ప్రాణం హరించా డితడు అని వార్త వచ్చింది. ఆ విషయం మీకు తెలుసునా గొంకరాజుగారూ?

గొంక : చిత్తం మహారాజా ! ఆ విషయం మరీ దారుణమండీ. వర్ధమానపుర ప్రభువు కుమారులకు ఆదవోనివారి అమ్మాయి అన్నాంబికాదేవిని ఇవ్వడానికి నిశ్చయించడం, ఆ వివాహానికి అనేక వీరులతో లకుమయారెడ్డి తర్లి వెళ్ళడం, మహాప్రభువులు, మంత్రులు ఆశీర్వచనాలతో వధూవరులకు బహుమతులు పంపడం జరిగింది.

రుద్ర : అవును. అది అంతా మాకు తెలుసును. ఆ పీటలమీద పెళ్ళి చెడగొట్టాడీ గజదొంగే!

గొంక : అవధారు మహారాజా! ఆ పెళ్ళి అలాచెడగొట్టి, ఈగన్నయ్య పెళ్ళి కొడుకును ఎత్తుకు పారిపోయి, మరి వారంరోజులకు వర్ధమానపురం తిరిగి పంపాడట! వివాహానికి ఉప్పల సోమప్రభువు వచ్చి, మీకు గోన గన్నయ్య తల చూపిస్తానని రాజలోకం ఎదుట ప్రగల్భాలాడి, తిన్నగా తన నగరానికి వేంచేస్తున్నాడట.

రుద్ర : మంచిది.