పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

గోన గన్నా రెడ్డి

కాగానే నీకు సంపూర్ణంగా తెలియబరుస్తాను” అంటూ ముమ్మక్కను గట్టిగా కౌగిలించుకొని, ఆమె నొసట ముద్దుగొని, “అందుకనే నేనీ కవచం నిద్దురలోకూడా విడవకూడదు సుమా! అని కౌగిలి సడలించి, వెనుక కేగి, క్రీడాతల్పముమీద పండుకొనక, చెంతనున్న సాధారణతల్పమీద పండుకొన్నది. వెంటనే ఆమెకు నిద్ర పట్టినది.

ఈ చరిత్రఅంతా అ దర్పణంలోనే రుద్రదేవికళ్ళ కీనాడు ప్రత్యక్షమైనది.

తనలో ఈనా డీ ఆలోచనలన్నీ రావడానికి మూలకారణం చాళుక్య వీరభద్రునితో కలిసి తాను వేటకు వెళ్ళడమే!

రుద్రప్రభువు కా అభ్యంతరమందిరాల నంటి ఒక ప్రత్యేకోద్యానవనమున్నది. రుద్రప్రభువు నగరు ఏకశిలకు తూర్పున నున్నది. ఆ నగరిలో వెలుపలి తోటకూ అభ్యంతరక్రీడావనానికి మధ్య ఎత్తయిన గోడ ఉన్నది.

ఈ రెండు ఉద్యానవనాలకూ మధ్య ఒక ద్వార మున్నది. అది దుర్భేదము. ఆ ద్వారము బంధించు నుపాయము ఒక్క రుద్రప్రభువునకు, వృద్ధదాదియగు చెమ్మసానికి, చెలి అయిన వీరమాంబకు గాక ఒరు లెరుగరు.

రుద్రదేవి : సముజ్జ్వలవేషాలంకృతయై అపరాజితాదేవిలా ఒక్కరిత ఆ సాయంకాలము ఆ నర్మోద్యానవనాన విహరిస్తున్నది. అలా బాలికలా ఆ తోటలో విహరించిన దినాలే రెండు మూడో ఇంతవర కా దేవి జీవితంలో!

ఆమె నగరిలో బాహ్యవనంలోనికి ఎవ్వరూ రాకూడదు. యువరాజదంపతులు అందు విహరించుటకే ఆ ఉద్యానవనము ఆ వనానికి రుద్రప్రభువు లోని తోటనుండి మరొక్కదారి ఉన్నది.

యువరాజు నగరి నంటి యువరాణి ముమ్మడాంబికాదేవి నగరున్నది. ముమ్మడాంబికాదేవి నగరులో ప్రత్యేకోద్యాన మున్నది. దానికీ, యువరాజోద్యానానికీ ద్వార మున్నది. దేవ్యుద్యానానికి బాహ్యోద్యానానికి వేరే ఒక దారి ఉన్నది. బాహ్యోద్యానానికి యువరాజు బాహ్యనగరిలోనుండి ఒక్కటే దారి ఉన్నది.

ఆ సాయంకాలం యువరాజు రుద్రప్రభువు దర్శనార్థం, దక్షిణ కళింగ విషయాలు చర్చించడానికి చాళుక్య వీరభద్ర ప్రభువును తోడ్కొని శివదేవయ్య మంత్రులు యువరాజనగరికి వచ్చి, ప్రభువు దర్శనం రాత్రి మొదటి ఝాము, మధ్యలో గాని కలుగదని దౌవారికలు విన్నవించినంత, శ్రీ శివదేవయ్యమంత్రి శ్రీ చాళుక్య వీరభద్రుని క్షమాపణ వేడుచు వారిని యువరాజు బాహ్యోద్యానవనానికి తీసుకొని వెళ్ళి అటు నిటు త్రిప్పుచు వారితో రాచకార్యా లెన్నో మాట్లాడుచుండెను.

ఇంతలో మహామంత్రి తనకు సంధ్యావందనపువేళ అయినదని ఆ తోటలోనే ఉన్న బ్రాహ్మణునిఇంటికి పోయి ఒక్కఘడియలో వత్తుననియు చెప్పి వెడలిపోయెను.