పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

45

లైన బాహత్తర నియోగాధిపతులు ఆ ఉత్సవాలలో నేల ఈనినట్లు సంచరించు చుండిరి.

మహారాజనగరిలో వివాహమహాసభామందిరమందు క్రింద పరచిన రత్నకంబళ్ళపై, పట్టుపరుపులపై ఉపధానాల నానుకొని వారి వారి అధికారాల, పదవుల ననుసరించి మహాప్రభువు లంతా కూర్చుండిరి. వేయిమంది వేద వేదాంగ పారంగతులు వేదమంత్రాలు చదువుచుండిరి. దుర్జయవంశస్థులైన ఆంధ్ర క్షత్రియ వంశాలవారు, వెలనాటిచోడులు, చాళుక్యులు, పల్లవులు, కదంబులు, గాంగులు, గజపతులు కొందరు స్వయంగా విచ్చేసిరి. కొందరు తమ రాజవంశాలవారిని ప్రతినిధులుగా పంపిరి. ఆంధ్రసామ్రాజ్యం ప్రక్క దేశాలైన శౌణ, విదర్భ, చోడ, కేరళ, కొంకణ, అపరాంత, బల్లాల రాజులు తమ రాజప్రతినిధులను బహుమానాలతో పంపిరి.

గజములు, గుఱ్ఱములు దాస దాసీజనులు, బంగారము, రత్నఆభరణాలు, మంచిగంధపు వస్తువులు, ధనరాసులు, కస్తూరి, జవ్వాజి, పునుగు, అందుగుబంక, హిమవాలుక, కాశ్మీరకుసుమము, లవంగ, యాలకి, జాజికాయ, జాపత్రి, లవంగపట్ట, మంచిగంధతరువులు, వివిధ సువాసనతైలాలు, వివిధ ఫలాలు వధూవరులకు ప్రాభృతా ర్పించారు.

ఈలా అఖండవైభవంగా వివాహం జరిగిన నాల్గవనాటిరాత్రి శోభనమందిరంలో వధూవరులు ఒంటిగా కలుసుకొన్నారు.

ముమ్మడమ్మ కోర్కెలతో కరిగిపోతూ చిన్ననాటినుండి తనతో ఆడుకొన్న తన మనోనాథుడు, తన ఆత్మవిభుడు, తన గాటంపు చెలిమికాడు, తన భర్త అయి ఎదుట తల్పంపై కుమారస్వామివలె అధివసించియుండ సిగ్గుపడుతూ, కాంక్షతో నాథుడు తనకడకు చనుదేరడం కోరుతూ ఎదురుచూస్తున్నది. రుద్రదేవప్రభువు చెక్కుచెదరక ఒక ఘటికాకాలం కదలకుండా ఎక్కడో చూపులతో అలాగే కూర్చున్నాడు.

ముమ్మడాంబికకు రోషము, దుఃఖము, ఆశా వెలుగునీడలులా ప్రసరించి పోయినవి.

అప్పుడు రుద్రదేవుడు నిదానంగా మన్మథతల్పంనుండి క్రిందికి దిగి ఒయ్యారంగా నడుస్తూ ముమ్మక్కదగ్గరకు వచ్చి,

“మహారాణీ ! నా కో వ్రతమున్నది. అది గౌరీ ప్రియమైన అసిధారావ్రతం! అందుకనే నా జుట్టు పెంచుకుంటున్నాను చూడు. ఆ అసిధారా వ్రతోద్యాపన సమయం వచ్చేవరకు నీ పుత్రలాభోత్సవానికి అంకురారోపణ జరుగరాదు” అంటూ తన కిరీటముతీసి దీర్ఘ కుంతలాలు సడలించి “ప్రాణప్రియురాలైన నా రాణీ! ఈ నా వ్రత కేశభారము చూచావుకదా! స్త్రీలకుకూడా ఇంతటి సంపద ఉండబోదు సుమా! అందుకు పరమగోప్యమైన ఒక కారణం ఉన్నది. అది నా దీక్షాసమాప్తి