పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

47

7

రుద్రదేవి పూలచెట్టుకూ పూలచెట్టుకూ వనదేవతలా తిరిగింది. రుద్రదేవి కేళాకూళికీ ఆనందలక్ష్మిలా తిరిగింది. చంద్రుని దివ్యామృతరూప రహస్యం తెలిసికొనడానికి విశ్వం చుట్టివచ్చే రోహిణిలా, ఆ ఆంధ్ర యువరాజ్ఞి ఆ తోటంతా తిరిగింది.

సామంతులలో, రాజోద్యోగులలో కొందరు తన్ను యువతి అని అనుమానిస్తున్నారు. తన తండ్రిగారి కాకతీయవంశంవారి ఈ మహాసామ్రాజ్యభారం వహించడానికి తాను జన్మాంతమూ ఈలా పురుషునిలా ఉండవలసినదేనా? స్త్రీగా రాజ్యాలు పాలించడానికే వీలులేదా? లోకానికి మూలాధారం శక్తి అని దేశికులే అన్నారే. సర్వదేవతలూ భండాసురుణ్ణి నిర్జించడానికి మహాయాగం సలిపినప్పుడు ఉద్భవించిన కామేశ్వరీమహాదేవి సకలసృష్ట్యద్భుతంగా ఆ భండాసురుణ్ణి నిర్జించ లేదా? స్త్రీ భయంకరసింహిక కాకపోతే చుట్టూవుండే పురుషులు నక్కలై ఆమెను పీక్కుతింటారు. తన చెల్లెలు గణపాంబిక అదృష్టవంతురాలా? తా నదృష్టవంతురాలా? చెల్లెలికిగూడ తన జీవితరహస్యం తెలుపడానికి వీలులేదని శివదేవుల ఆజ్ఞ. నాయనగారి ఆజ్ఞ.

తన ముద్దుచెల్లెలు లోకసమ్మోహమైన రూపంతో పెరిగింది. ఆటపాటలలో రాణివాసం అంతా ఆనందంతో ముంచెత్తేది. ఆమె బాలికయయ్యు తనతోపాటు వీరవిద్యలన్నీ నేర్చుకుంది. అయినా పురుషవేషంలో ఉన్న నాకన్న ఎన్నిరెట్లో ఆనందంగా ఉండేది. “అన్నగారూ” అని ఆమె తనయందు ఆ చిన్ననాటి రోజులలో చూపిన ప్రేమ, తనమెడచుట్టూ ఆ బాలిక చేతులుచుట్టి బుజ్జగించిన మాటలు, నారద గీతాలకు పాఠాలు నేర్పుతుండేవి!

ఆ గణపాంబాదేవి తనకన్న మూడేడులు చిన్న. ఆమెను పదునెనిమిదవ ఏటను ధరణికోట ప్రభువునకు ఇచ్చి వివాహంచేసిన దృశ్యాలు తనకు కలిగించిన ఆనందము వర్ణనాతీతం.

తన చెల్లెలు గణపాంబాదేవిని స్వస్తి. శ్రీ చతుస్సముద్రముద్రిత, నిఖిల వసుంధరా పరిపాలక, శ్రీమత్త్రినయనపల్లప ప్రాసాదాసాదిత, కృష్ణవేణీనదీ దక్షిణ షట్సహస్రావనీవల్లభ, భయలోభదుర్లభ, చోళచాళుక్య సామంత, మదానేకపమ్రృగేంద్ర, విభవామరేంద్ర, శ్రీమదమరేశ్వరదేవదివ్య శ్రీపదపద్మారాధక, పరబల సాధక, శ్రీధాన్యకటకపురవరాధీశ్వర, ప్రతాపలంకేశ్వర, కళిగళ మోళడక్కె, బెట్టరగవక్కె, గండరగండ, గండభేరుండ, జగమెచ్చుగండ, నన్ని మార్తాండ నామాది ప్రశస్తిసహిత, శ్రీమన్ మహామండలేశ్వర కోటకేత మహారాజ మనుమడు, శ్రీ కోట రుద్రరాజ మహామండలేశ్వరుల పుత్రరత్నమైన బేతరాజునకు వివాహము గావించినారు. ఆ వివాహ వైభవం భరతఖండంలో, సర్వ మండలంలో, దివ్యలోకాలలో కథలుగా చెప్పుకొన్నారని కవులు వర్ణించిరి.