పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

37

తెలియును. తర్వాత చెన్నాప్రెగడ గణపామాత్యునకు తెలిసినది. అది అంతటితో సరి.

తాను బాలకు డను భావముతోనే రుద్రదేవి తనలో కలుగు స్త్రీ చిహ్నాలు గమనించకుండ బాలక్రీడలలో మునిగియుండునది. ఈడువచ్చిన ఆనాటి సంఘటనయు ఆమె కంత పట్టినదికాదు. ఏదియోవంకను మహారాణి సోమాంబ రుద్రాంబ నా మూడు దినములూ అంతఃపురాన నిలిపియుంచినది. బాలికకు జరుగు వేడుక లేవియును ఈ బాలికకు జరుపలేనందుకు సోమాంబికాదేవి లోలోన దుఃఖించినది కాని, రాజకీయావసరముకాన భర్త ఆజ్ఞయే ఆమెకు పరమాజ్ఞ అయినది.

అలా ఒకయేడు గడిచింది. రుద్రమదేవిలోని యౌవనచ్ఛాయలు ఎంత మాత్రమైన ఇతరులకు తెలియకుండ మహారాణి ఎన్నియో కట్టుదిట్టాలు చేసింది.

ఒకనాడు రుద్రదేవి ఒకశిల్పము చూచినది. ఆ శిల్పము ఒక దేవీ విగ్రహము. అ దేవీవిగ్రహమునకున్న ఉత్తుంగవక్షోజాలు, సన్ననినడుము చూచాయగా ప్రదర్శింపబడిన నగ్నత చూచి ఆమె కాశ్చర్యము వేసినది. ఆ విగ్రహమును రుద్రేశ్వరాలయమునకు బోయిన రుద్రదేవి చూచినది. రుద్రదేవి ఇదివరకెన్నడు ఆలయములు దర్శింపలేదు. నృత్యాలు చూడలేదు. ఇతరబాలికల నగ్నతల నామె యెరుంగదు.

ఆ దినము అనుమకొండ రుద్రేశ్వరాలయానికి ఆమె వెళ్ళునని ఆమెకు తెలియదు. అనుమకొండలో జరుగు ఒక ఉత్సవానికి సామంతరాజకుమారులతో కలసి ఆమె బోయినది. ఆమె వారితో రుద్రేశ్వరాలయ ప్రాంతాలకు బోవుట తటస్థించినది.

తన తాతగారి అన్న రుద్రదేవ చక్రవర్తి నిర్మించిన మహాదేవాలయం చూడాలని ఆమె కేలనో బుద్ధిపుట్టినది. ఆమె రాజకుమారులకు తనతో రండని ఆజ్ఞ ఇచ్చి గుఱ్ఱము డిగ్గి గుడిలోనికి పోయినది. ప్రక్కనున్న శివదేవయ్య మంత్రు లెవరితోనో మాట్లాడుచుండిరి.

ఈ సమయంలో రుద్రదేవి గుడిలోనికి పోయినది. రాజకుమారులమాటలలో స్త్రీ పురుష భేదము ఆమె కప్పుడు పూర్తిగా అవగాహనం అయిపోయినది. ఆమె తాను స్త్రీనను అనుమానం ధృడమైపోయింది. వెంటనే మహావేగంతో ఓరుగల్లు పురం చేరింది. తల్లి గారైన మహారాణి సోమాంబికాదేవికడ కామె వెంటనే వెళ్ళింది.

“అమ్మగారూ, నేను మీవంటి బాలికనై ఉంటే, నన్ను బాలకుణ్ణిగా ఎందుకు పెంచి, లోకాన్ని మోసంచేస్తున్నారు?” అని అడిగింది.