పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

గోన గన్నా రెడ్డి

అ వర్ణనలు నిజానికి కొన్ని యోజనాల దూరంగా ఇప్పుడాతనికి కనిపించాయి. మన్మథునిలో ఎక్కువ ఆడతనం ఉంది. కుమారస్వామిలో ఎక్కువ మగతనం ఉన్నది. జయంతునికి వా రిరువురిలోని తేజస్సులేదు. నలకూబరుడు మనుష్యులకు దగ్గరివాడు. వసంతుడు ఒక్క ఋతుకాలమాత్ర సౌందర్యం కలవాడు. వీరందరిలో లేని ఏదో ఒక మహాసౌందర్యోజ్జ్వలత ఈ బాలునిలో ఉన్నదని చాళుక్యవీరభద్రు డనుకొన్నాడు.

కుమారస్వామి శుద్ధవటువు, మన్మథుడు శుద్ధప్రేమికుడు. వీరిద్దరిని తనలో లయించుకొని వీ రిరువురిని మించిన ఈ మహాభాగుడు చాళుక్య వీరభద్రుడా? ఆంధ్రామృతప్రవాహాలు కట్టించిన నన్నయమహాకవికృత భారతాన్ని కృతినందిన రాజరాజనరేంద్ర చక్రవర్తి వంశములోనివాడైన ఈ యువప్రభువు పురుషసౌందర్యానికి పాణినీయసూత్రమని ఆమె అనుకున్నది.

నాటినుండి రుద్రప్రభువు వీరభద్రప్రభువు స్నేహాన్ని వాంఛించాడు.

వా రిరువురు ఎన్నిసారులో కలుసుకొన్నారు. ఒక పర్యాయము వీరభద్రుడు “మహారాజా! కాకతీయవంశానికి చాళుక్యులు శివునికి శూలంలా కాగలరు” అన్నాడు. ఆ భావంలోని ఆనందంచేత రుద్రప్రభువు వీరభద్రుని రెండుచేతులు తన రెండుచేతుల పట్టుకొని తన మూర్థాన ఉంచుకొన్నాడు. ఆ క్షణంలో వేయి విద్యుల్లత లొక్కసారి వీరభద్రుని దేహమెల్లా ప్రసరించి అతడు ఝల్లుమనిపోయినాడు. వీరభద్రుని కేదో సిగ్గువేసినది. అతడు వెంటనే కాకతీయ మహాప్రభువు చేతులు రెండూ వదలివేసినాడు.

రుద్రప్రభువునకు లోకజ్ఞానమే నశించినది. ఆ ప్రభువునకు అమృతము సేవించిన దేవతలకు కలిగిన వివశత్వము కలిగినది. అది స్నేహప్రభావమని ప్రభువు అనుకొన్నాడు. రుద్రదేవునిలో నిద్రపోవు రుద్రదేవి ఒకసారిగా ఉలిక్కిపడి లేచింది. ఆమె మోము కెంపువారింది. కన్నులుమూసికొనిపోయినాయి. ఆమె వక్షోజాలు పొంగిపోయినాయి. ఆమె పెదవులలో అమృతా లూటలూరినవి.

ఈనాడు చాళుక్యరుద్రునితో అభేదానంద మనుభవించిన రుద్రదేవి అనిర్వచనీయమగు సంతోష మనుభవించుచున్నది. కావుననే నిట్లలంకరించుకొన్నది.

బాలికావేష మిదివర కెప్పుడును ధరించినది కాదు. ఆనాడు చాళుక్యరుద్రునితో స్నేహముకలిగిన క్షణంనుండి తాను బాలికనని ఆమెకు ఎన్నిసారులో ఆలోచన వచ్చినది. ఆ వచ్చుటకు కారణ మామె ఊహింపలేదు. ఆమెలోని స్త్రీత్వము ఆమె కీడువచ్చిన ఎంతకాలమునకోగాని గురుతు రాదాయెను. ఆమె కీడువచ్చినప్పుడు రాణివాసంలో జరుగు నెలరోజులు మహోత్సవములు జరుగలేదు. ఈడు వచ్చినదని రాణులకు, గణపతిదేవునకు, శివదేవయ్య మంత్రికి మాత్రమే