పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

గోన గన్నా రెడ్డి

మహారాణి తెల్లబోయి “ప్రభూ! చక్రవర్తికి వార్తపంపుతాను. వారు వచ్చినవెనుక మీ అనుమానం తీరుతుంది” అని ప్రతివచనమిచ్చి వెంటనే గణపతి రుద్రదేవులకు వార్త పంపినారు.

వార్త వెళ్ళిన అరఘటికలో మహారాజు మహారాణి అంతఃపురానికి వచ్చినారు. మహారాణి వారితో అంతయు విశదము చేసినారు.

గణపతిరుద్రదేవుఁడును తెల్ల బోయి, స్వయంభూదేవుని ఒక నిమేషం ప్రార్థించి ఒక నిశ్చయానికి వచ్చినాడు. వెంటనే మహారాణి అంతఃపురంలో చక్రవర్తిని కలుసుకొనవలసినదిగా శివదేవయ్య దేశికులకు వార్త వెళ్ళినది.

4

నలభై విఘటికలలో శివదేవయ్యమంత్రి పట్టపుమహారాణి నగరానికి విచ్చేసి తనరాక లోనికివార్త పంపగా మహారాణి అభ్యంతరసభామందిరాలలో చిన్నదానిలోనికి ముఖ్యమంత్రిని తీసుకొనిరా మహారాణి చెలికత్తెలను పంపినది. వారు దారి చూపుచుండ శివదేవయ్య లోనికి దయచేసినారు. ఆయన పాదాలకు చక్రవర్తియు, సామ్రాజ్ఞియు, రుద్రదేవియు లేచి నమస్కరించి ఉచితాసనంపై కూరుచుండ ప్రార్థించిరి. వారును వారందరిని ఆశీర్వదించి ఉపవిష్ణులైరి.

శివ : మహాప్రభూ ! ఎందుకు ఇంతతొందరగా నాకు వార్త పంపినారు? యువరాజుగారు తొందరలో నగరానికి రాగానే నేనున్ను వెంటనే మా గృహానికి చేరాను. ఇంతలో మీ వార్త వచ్చినది.

గణ : మహామాత్యా! రుద్రప్రభువు తాను బాలికయై ఉండగా ఏల పురుషునిగా తన్ను పెంచినారు అని అడుగుతున్నారు.

శివ : అలానా! రుద్రప్రభువులు చాళుక్యమహావంశచరిత్ర ఎరుగుదురా అని మనవిచేసుకుంటున్నాను.

రుద్రదేవి : ఎరుగుదును బాబయ్యగారూ !

శివ : ఆ వంశంలో ఇద్దరు ముగ్గురు కుమారులు చక్రవర్తులకు కలుగుతూ ఉండడము, ఆ అన్నదమ్ములు రాజ్యానికి వారిలో వారు పోరుతూ దేశానికి అరిష్టం తీసుకువస్తూ ఉండడము జరిగినదాయెను. ఆ జ్ఞాతియుద్ధాలవల్ల సుభిక్షమైన ఈ నాడులన్నీ కాటకాలకు లోనవుతూ ఉండేవి.

రుద్ర : మహామంత్రీ! చాళుక్య మహారాజుల చరిత్రకూ నన్ను పురుషునిగా పెంచడానికీ సంబంధం ఏమిటి?

శివ : ప్రభూ, వినండి. రాజులేని రాజ్యం తలలేని దేహంవంటిది. ఒక రాజ్యానికై ఇద్దరు రాజులు పోరువడడం రాజు లేకపోవడమేగదా!