పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివదేవయ్య

281

ఇంతలో చక్రవర్తికడనుండి ఆ మరునాడు మధ్యాహ్నము సూర్యుడు నెత్తి మీద ఉన్న వేళకు మహాదేవరాజు సైన్యాలపై ఒత్తిడి ఎక్కువ చేయవలసిందని ఆజ్ఞ వచ్చిందని మల్యాల కాచయప్రభువు గన్నారెడ్డికి వార్త పంపినాడు.

ఈ మూడు సైన్యాలు మూడువైపులా కాపలా కాచినారు. ఎక్కడో దూరాన నుండి ఆశ్వికసేనలు, గజాలు, రథాలు బయలుదేరి వేగంగా వచ్చి మహాదేవరాజు సైన్యాలకు వెనుకదెసతాకినవి. ఈ తాకిడి ప్రళయంలా ఉండడంవల్ల మహాదేవరాజు సైన్యాలు ఎన్నో వెనుకవైపునకు తిరిగి ఆ మహావర్తాన్ని ఎదుర్కొన్నాయి, గన్నారెడ్డి ఆశ్వికసైన్యాలు వేగంగా వచ్చి విరోధుల్ని తాకి బాణాలు వదలడం, మళ్ళీ అంతవేగంతోనే వెళ్ళిపోతుండడం అనే ఆవర్తయుద్ధవిధానం ఉత్తమమయిందని తెలియజేసినాడు. మహావేగంతో వెళ్ళేవాడు గురికి దొరకడు. అతడు ప్రయోగించే బాణాలుగాని, భల్లాలుగాని, తోమరాలుగాని నిలిచియున్న విరోధులకు తగిలి తీరుతాయి.

ఈ ఆవర్తవిధానం చూచి భ్రమసిపోయి శత్రువులు వేలకొలది కూలి పోతున్నారు.

సరిగా ఆ సమయంలో కంపకోట వదలి ప్రసాదాదిత్యప్రభువు లక్షమంది సైనికుల్ని విరోధిపై ప్రయోగించాడు. శత్రుసైన్యాలు ద్విముఖమై యుద్ధం చేస్తున్నాయి.

ప్రసాదాదిత్యప్రభువు, శత్రువు తాత్కాలికంగా నిర్మించుకొన్న గోడలను అనేకప్రదేశముల బద్దలుకొట్టించి లోనికి ప్రవేశించాడు. పోరు ఘోర మయ్యెను.

ఆసమయంలో వేయి మహాకాహళపు మ్రోతలు విననైనాయి. కంపకోటకు ముందుకు రెండుపాయలుగా ఏనుగులువచ్చి ప్రసాదాదిత్యునికి బాసట అయినాయి. ప్రసాదాదిత్యుని సైన్యాలు నెమ్మదిగా వెనక్కు తగ్గుచు మళ్ళినవి; వారిమీద విరుచుకుపడేవారిని గజసైన్యాలు నిలువరించినవి. గజసైన్యాల వెనుకకు ప్రసాదాదిత్యుని బలాలు మళ్ళగానే ఏనుగులు వెనుకకుమళ్ళి కంపకోటలోని దిడ్లవెంటలోని కేగినవి.

మహాదేవరాజు శత్రువులు ఓడినారని తలచి ఒత్తిడి ఎక్కువ చేసినాడు. ఆ సమయంలో మల్యాలవారు, గోన గన్నారెడ్డి ఆవర్తయుద్ధం మాని నిలచి పోర సాగిరి. కాలిబలగాలు ముందుకు జరిగాయి.

ఇటు మట్టికోటలోనివారు కంపకోటదగ్గరకు రాకుండ శత్రువును నిలువరించినారు. కంపకోటనుండి ఒత్తిడి తక్కువైనది. శత్రువులు తమ వేగం తాము ఆపుకోలేక, ఎదిరివారు కంపకోటను కాపాడుకోలేకుండా ఉన్నారని, కంపకోటపై విరుచుకుపడినారు.