పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

గోన గన్నా రెడ్డి

ఇంతట ఫెళఫెళారవాలతో, నూనెలతో తడుపబడి గంధకాదులతో సిద్ధమై యున్న కంపకోట అంటుకొన్నది.

5

కంపకోట అంటుకొన్న వెంటనే భుగభుగ మనే మంటలు ఆకాశంపై దుమికాయి; మంటలతోపాటు నూనెపొగలు, గంధపు పొగలు నాసికారంధ్రాలలో దూరి వీరుల కళ్ళు మూసినవి. ఆపుకోలేని దగ్గు వచ్చినది.

వేగంతో ముందుకురికిన యాదవబలాలు వెనక్కు మళ్ళలేక మంటలలో పడిపోయినవి. హాహాకారాలు, గోలలు నభోంతరాళం నిండిపోయినవి.

సువ్వు సువ్వున వేగంతో మహావర్షపాతంవలె బాణాలు శత్రువుల ప్రాణాలు హరిస్తున్నాయి. రెండు గడియలకు శత్రువులు తెప్పరిల్లి వెనుకకు మరలిరి. మంటలు తగ్గెను. ఆంధ్రసైన్యాలు మంటల వెనుకనుండి ఉధృతంతో శత్రువులపై కురికెను. ఓరుగల్లు కోటగోడలు పగిలినట్లు ఆంధ్రసేనలు విరుచుకు పడినవి. చెక్కు చెదరకుండా, వ్యూహనిర్మాణం చెడకుండా, నిధిలా, ఆ వాహినులు శత్రువుల నాశనం చేస్తున్నవి. తమ గోడలలోనికి పోయికూడా శత్రువులు రుద్రదేవి బలగాలను ఆపలేకపోయినారు. శత్రువుల తాత్కాలిక కుడ్యాలు కూల్చి శత్రుశిబిరాలలోనికి చేరి, రుద్రదేవే ముందుండినడిపే ఆ ఆంధ్రవాహినులు విరోధిబలగాలను నాశనం చేస్తున్నవి. మహారాజు తన యుద్ధకౌశల్యమూ, పౌరుషమూ, ఓడిపోతానన్న భయము చేత కల్గిన కోపమూ మూడు త్రేతాగ్నులుగా విజృంభించి రాక్షసునిలా పోరాడినాడు. యాదవసేనలు తమ నాయకుని మెప్పుపొందే భయంకర యుద్ధము చేసినవి.

వీరనష్టంకాకుండా యుద్ధం చేయదలచుకున్న రుద్రదేవి ఆజ్ఞచొప్పున గోన గన్నారెడ్డి, మల్యాలనాయకులు ఆవలివైపునుండి భయంకరమైన యుద్ధం ప్రారంభించినారు. ఇటు రుద్రమ ఆజ్ఞచొప్పున భేరీలు మ్రోగినవి. రుద్రమదేవి సైన్యాలలో కొత్తసైన్యాలు వచ్చి పదాతులకు, ఆశ్వికులకు రక్షణ కల్పింపగానే ఆ యా బలాలన్నీ కోటలోనికి వెళ్ళిపోయినవి. ఏనుగు బలాలు కోటచేరినవి.

కోటదగ్గరకు యాదవసేనలు రావడానికి వీలులేదు. అటు గోన, మల్యాల సేనలు వెనుకకు జరిగి మాయమైనవి.

ఆ దినమందు యాదవసైన్యాలలో ఒకలక్షఏబదివేలమంది వీరులు మరణించినారు. గాయాలు తగిలినవారు, ఆంధ్రులకు దొరికినవారూ పెక్కు వేలమంది.