పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

గోన గన్నా రెడ్డి

బావగారైన గోపరాజురామప్రధానిచే త్రైలింగ మహాసామ్రాజ్యంలో రాజ్యపాలన నిర్వక్రంగాజరిగేటట్లు చూస్తున్నవాడు, శివపూజా ధురంధరుడు.

ఈవల ప్రసాదాదిత్యనాయుడు కాకతీయవంశంతోపాటు వుద్భవించిన రేచెర్లవంశ ముక్తాఫలము. రేచెర్ల వారందరూ కాకతీయవంశ మూలపురుషుడైన భేత ప్రభువు కాలంనుండి కాకతీయ ప్రభువులకు దక్షిణహస్తాలుగా వుండిన మహా పద్మనాయక వెలమకులజులు. అఖండ శౌర్య సంపన్నులు. సూక్ష్మబుద్ధిశాలురు. కాకతి ప్రభువులకు పెట్టనికోటలు.

శివదేవయ్యమంత్రి నాయనివంక చూచి “సేనాపతీ ! రుద్రమదేవివారి మనస్సు మార్చడం ఎల్లాగు? ఆ దేవికి మీరు స్త్రీలమ్మా అనేభావం నచ్చచెప్పడం ఎలాగు?”

“గురుదేవులవారికి నేనా సలహా ఇచ్చేది ! ఈపాటికి ఏదో ఎత్తువేయకుండా వుంటారూ?”

“ప్రసాదాదిత్యులవారూ! మానవప్రకృతి మనుష్యుని ఊహకుమించి నడుస్తూవుంటుంది.”

“మహామంత్రీ ! చాళుక్య వీరభద్రులవారికి తమరు ఎందుకు వార్తపంపినట్లు?”

“యవ్వనహృదయాన్ని, యవ్వనహృదయమే గ్రహిస్తుంది. చాళుక్య వీరభద్రమహాప్రభువు యౌవనవంతుడు, మహావీరుడు, కామినీ జయంతుడు. ఆయనకు యువమహారాజుల హృదయం అర్థంకాకూడదా అని రప్పించాను.”

“తమ అభిప్రాయం నేను తెలుసుకోలేనంటారా? పైగా రుద్రమదేవ మహాప్రభువులు, చాళుక్య వీరభద్రప్రభువు కలిసి ఎందుకు వేటకు వెళ్ళడం ఏర్పాటు చేశారు?”

“ప్రసాదాదిత్యులవారూ ! మీరు మన మనుకున్న మువ్వన్నె మెకాన్ని సిద్ధంచేశారా?”

“అన్నీ సిద్ధమే. నేను ఆ ప్రదేశంలోనే వారిరువురకు తెలియకుండా సిద్ధంగానే వుంటున్నాను.”

4

శ్రీ లకుమయారెడ్డి మహారాజుకు అన్నగారు బుద్ధారెడ్డి సాహిణి. ఈయన భువనగిరి రాజధానిగా ముచికుందసీమ రాజ్యంచేస్తూ శ్రీ శ్రీ సమధిగత పంచమహాశబ్ద, మహామండలేశ్వర, పరమమాహేశ్వర, పతిహితచరిత, విజయవిభూషణ, శ్రీ అనుమకొండ పురవరాధీశ్వర, చలమర్తిగండ, మూరురాయ జగదాళ నామాది సమస్త ప్రశస్తిసహితం, శ్రీ స్వయంభూదేవర దివ్య శ్రీపాదపద్మారాధకులైన