పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్ర

21

శ్రీమన్మహామండలేశ్వర కాకతీయమనుమ రుద్రదేవ మహారాజులను భక్తితో కొలుస్తూ ఉండెను.

కల్యాణి రాజైన తైలపుణ్ణి ఓడించడంలో శ్రీ శ్రీ కాకతి రుద్రదేవ చక్రవర్తికి సహాయంచేసినవా డాయెను బుద్ధారెడ్డి.

భువనగిరికి దక్షిణంగా ముప్ఫై గవ్యూతుల దూరంలో వర్ధమానపురం అనే పురము ఉండెను. ఆ పురము రాజధానిగా మానుకోటవిషయాన్ని తెలుగు చోడులు రాజ్యం చేస్తూ ఉండిరి.

వర్ధమాన మహాపురం నాలుగు గవ్యూతుల మహాదుర్గం. అపరిమిత భోగభాగ్యాలతోనున్నూ అనేక దేవాలయాలతోనున్నూ అనుమకొండను మించిఉండేది. ఆ పురం రాజధానిగా శ్రీ శ్రీ కాకతి రుద్రదేవ మహారాజు కాలంలో భీమచోడుడు తన సోదరుడు గోకర్ణచోడుడు మంత్రిగా, సేనానాయకుడుగా, యువరాజుగా రాజ్య పరిపాలనం చేస్తూ పశ్చిమచాళుక్య చక్రవర్తైన తైలప మహారాజుకు సామంతుడుగా ఉండెను.

ఆ భీమచోడనృపాలుడు వెనుకటి శ్రీకృష్ణుని మామైన కంసభూపాలుని యశం తన అపయశంచేత తెల్లగా కనిపింపజేసే పరమదుర్మార్గుడు. తన సవతి తల్లిని విలాసవతిగా చేసికొని ఉన్నాడు. సవతితల్లి కుమారుడు, బాలుడు చిన్నగోకర్ణుడు తిరగబడి అసహ్యించుకొని కళ్యాణికి వేగు పంపించగా, వాడుభోజనం చేస్తూ ఉండే సమయాన వాణ్ణి చంపించాడు భీముడు.

ఆ మహాపాపం భారతభూమిని గగ్గోలుపరిచింది. భువనగిరికొండల్లో మారుమ్రోగగానే రుద్రుడైన శ్రీ గోన బుద్ధరాజు అనుమకొండకు శ్రీ రుద్రదేవ చక్రవర్తులకు సహాయం రావలసినదనీ, ఆంధ్ర చక్రవర్తుల చల్లని వెన్నెలవంటి ప్రభుత్వానికి ఈలాంటి పాపిని రాజ్యం చెయ్యనీయటమే కళంకం అనిన్నీ వినతి పత్రం పంపుకొన్నాడు. పశ్చిమచాళుక్య తైలపదేవ చక్రవర్తి రుద్రచక్రవర్తి పరాక్రమంవల్ల జబ్బుచేసి గుండె పగిలి కథావశేషుడుకాగా, ఆ రాజ్యం యావత్తూ భీమచోడనృపాలుడు ఆక్రమించుకొన్నాడు. కాబట్టి చక్రవర్తిత్వానికి సంపూర్ణత్వం సిద్ధించవలసివున్నదనియు మనవి చేసుకొన్నా డా వేగులో.

శ్రీ భువనగిరిపురవరాధీశ్వర, సతిహితచరణ బుద్ధారెడ్డి సాహిణి వర్ధమానపురం ముట్టడించగానే భీమచోడు డుగ్రుడై మహాకోపంతో సర్వబలాలతో వచ్చిన బుద్ధారెడ్డిని తాకినాడు. మూడురోజులు మహాయుద్ధం జరిగింది. భీమచోడుణ్ణి పరాక్రమవంతుడున్ను, వ్యూహరచనాసమర్ధుడున్ను అగు బుద్ధారెడ్డి అన్నిద్వారాల దగ్గరగా పూర్తిగా ఓడించేసరికి, భీమచోడుడు వర్ధమానపురం కోటలోకి పారిపోయినాడు.