పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్ర

19

శివ : నిజమే మహాప్రభూ, కాని శ్రీరుద్రదేవయ్యవారిని పురుషునిగానే యెంచి మనం ప్రమాణం చేయించితిమి. వారందరూ అలాగే చేసిరి. శ్రీ రుద్రదేవయ్యగారు పురుషులేనని చెబుతూ ఎంతకాలం రహస్యం దాచి వుంచగలవారం? ఏనాడో ఆ రహస్యం బయలుపడవలసిందేనని మహాప్రభువు లెరుగనిదికాదు.

గణ : అవును. మేము పరమశివుని సన్నిధిని చేరినవెనుక కొంతకాలం శ్రీరుద్రదేవయ్య చక్రవర్తిగా రాజ్యపాలన సాగించి నిలద్రొక్కికొన్న వెనుక అప్పుడు రహస్యం నెమ్మదిగా బైటపెట్టవచ్చునుగాక ఈలోపుగా తొందరేముంది?

శివ : మహాప్రభూ ! శ్రీ ప్రసాదిత్యనాయనింవారు కొన్ని ముఖ్యవిషయాలు తమకు తెలియజేస్తారు.

ప్రసా : మహాప్రభూ ! గోన లకుమయ, ఆదవోని కోటారెడ్డి, కందవోలు పందిభూపాలుడు, కల్యాణపుర చోడోదయుడు, వూగినాటి కోటపెమ్మాడిరాయడు, కందూరి కేశినాయకుడు. వీరంతా కలిసి కుట్రచేస్తున్నారు. తుంబలక, మానువ, హాలువవారూ ఆ కుట్రలో కలవాలని వువ్విళ్ళూరుతున్నారు. బేడచెలుకి, మేడిపలి కాచయప్రభువుల నమ్మలేము. ఈలాటి రహస్యవార్తలు అటు తూర్పునుండి, దక్షిణదేశాలనుండి వస్తున్నాయి. వారందరికీ చిన్నచక్రవర్తుల రహస్యం తెలిసిందని అనుమానించవలసి వుంటుంది.

శివ : అందుకనే మహాప్రభువులకు నేను మనవిచేసేది, ముందుగా రుద్రదేవులు స్త్రీయే అని లోకానికి చాటడం, తర్వాత...

గణ : మహామంత్రీ ! ఈ విషయంలో మీరూ, రుద్రదేవప్రభువులూ, ప్రసాదాదిత్యులూ ఆలోచించి ఏదిమంచిదైతే అదిచేయండి. ఎవరు కుట్రలో చేరబోతున్నారో వారిని ధర్మంగా శిక్షించండి. అనుమానరహితం చేసుకొని మరీ పనికి దిగండి. చూడండి, మహాకవి తిక్కన సోమయాజులవారు వుద్యోగపర్వంలో ఈవిషయం ఎంతచక్కగా వర్ణించారో ! ధర్మరాజు ఆఖరుకు అయిదూళ్ళడిగి అప్పుడు కాదనిపించుకొనికూడా శ్రీకృష్ణులవారి రాయబారం నడిపించారు. ఓహొహో ఏమి అద్వితీయ కవిత్వం! తమ పురుషార్థంలోని భావాలు ఎన్నో వున్నాయి ఆయన మహాగ్రంథంలో, ఇక సెలవు. విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేయండి.

శివదేవయ్యమంత్రి ఏబదిరెండ్లేండ యీడువాడు చామనచాయవాడు. సన్నగా పొడుగ్గా వంగిపోయి వుంటాడు. మహామాత్యులైన చెన్నాప్రగడ గణపామాత్యుల మేనల్లుడు. ఆరాధ్యుడైన వీరశైవుడుకాడు. విష్ణుభక్తికలవాడు, అఖండ పండితుడు, వేదవేదాంగ పారంగతుడు. సకలశైవాగమవేత్త. మేనమామవలె అఖండవైద్యుడు. చక్రవర్తిచేత అనేకవైద్యాలయాలు, ప్రసూతి ఆలయాలు, వైద్యవిద్యాపరిషత్తులు ఏర్పాటుచేసిన ధర్మశీలి, సర్వతంత్ర స్వతంత్రుడు. తన